వనం రాకతో పోటెత్తిన భక్తజనం
●ఘనంగా సాగుతున్న రెక్కల రామక్క జాతర ●జాతరలో పాల్గొన్న ముగ్గురు ఎమ్మెల్యేలు
గుండాల: కొమరం వంశీయులు ఇలవేల్పు రెక్కల రామక్క జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. గురువారం ‘వనం’(దేవత) రాకతో భక్తులు పోటెత్తారు. ఆళ్లపల్లి మండలం పెద్దూరు గ్రామంలో కొమరం వంశీయుల ఆధ్వర్యంలో మూడు రోజులుగా జాతర గిరిజన ఆచార సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తున్నారు. మంగళవారం కర్ర దించుట, దేవతకు కుంకుమ పూజతో పాటు, గుడి మేలుకొలుపు జరిపారు. బుధవారం ఒక్కపొద్దుల రెక్కల రామక్క దేవతను గుట్ట నుంచి గర్భగుడికి తీసుకొచ్చారు. గురువారం పాండవుల గుట్ట నుంచి వనదేవతను డప్పువాయిద్యాలతో, గిరిజన నృత్యాలతో తీసుకొచ్చారు. మార్గమధ్యలో ఎదుర్కోలు నిర్వహించారు. రాత్రి దేవతలకు గంగాస్నానం చేయించారు. అనంతరం గద్దెలపై ప్రతిష్ఠించి కల్యాణం జరిపించారు. దీంతో నిండు జాతర మొదలైంది. పూజారులు కొమరం కనకయ్య, సీతయ్య లాలయ్య, రఘుబాబు, రవి, ఆర్తిబిడ్డ కత్తుల సతీష్, వడ్డె ఈసం రామయ్య ప్రత్యేక పూజలు చేశారు. వనం తరలివచ్చే క్రమంలో భక్తులు పూనకాలతో ఊగిపోయారు. కొమ్ము నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చుట్టు పక్క మండలాలతోపాటు ఇతర జిల్లాల నుంచీ భక్తులు తరలివచ్చారు. శుక్రవారం మొక్కుల చెల్లింపు ఉంటుందని, శనివారం తిరిగి దేవతను గుట్టకు చేర్చుతామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
పెద్దూరులో జరుగుతున్న కొమరం వంశీయుల ఇలవేల్పు రెక్కల రామక్క దేవతను గురువారం ఇల్లెందు, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావులు దర్శించుకున్నారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గుట్ట నుంచి వనం తీసుకొస్తుండగా ఎమ్మెల్యేలు డోలీ చప్పుళ్లతో చిందు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొమరం హన్మంతు, మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, కొమరం వెంకన్న, రాంబాబు, సతీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వనం రాకతో పోటెత్తిన భక్తజనం
Comments
Please login to add a commentAdd a comment