ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మణుగూరు టౌన్: ఓ ఆటో డ్రైవర్ సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగాడు. ఈ సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని బాపనకుంటకు చెందిన శివ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్యతో మరో వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, వివిధ కారణాలతో తన భార్య దూరంగా ఉంటుందని పేర్కొన్నాడు. పలుమార్లు హెచ్చరించి, ఇద్దరికి దేహశుద్ధి చేసినా మార్పు రావడం లేదంటూ సెల్ఫీ వీడియోలో వివరించాడు. తన చావుకు వారే కారణమంటూ మంగళవారం రాత్రి పురుగుల మందు తాగగా, స్థానికులు గమనించి 100 పడకల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో బుధవారం రాత్రి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని సులానగర్‌కు చెందిన అజ్మీరా శివ కుమారుడు అశోక్ (34) బుధవారం రాత్రి టేకులపల్లి నుంచి సులానగర్ ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో టేకులపల్లి లారీ ఆఫీస్ వద్ద ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న బైక్ లారీని ఢీకొట్టింది. దీంతో అశోక్‌కు తీవ్రగాయాలయ్యాయి. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి లక్ష్మి, నాయకుడు కోరం సురేందర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.
చికిత్స పొందుతున్న యువకుడు..
బూర్గంపాడు: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సోందె పోస (20) తల్లిదండ్రులు కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో పోస తీవ్ర మనస్తాపానికి గురికాగా మండలంలోని చెరువుసింగారం గ్రామంలో ఉంటున్న అతని బాబాయి తన వద్దకు తీసుకువచ్చాడు. కొంతకాలంగా కూలిపనులకు వెళ్తున్న పోస తల్లిదండ్రులు లేరనే మనోవేదనతో ఈ నెల 7న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దమ్మపేటలో మరొకరు..
దమ్మపేట : రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మండలంలోని గండుగులపల్లి గ్రామంలో బుధవారం రాత్రి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని జగ్గారం గ్రామానికి చెందిన మడివి నాగేంద్రబాబు(30), వగ్గెల లక్ష్మణ్, సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడేనికి చెందిన కేతేపల్లి జానకీరామ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. నాగేంద్రబాబును వరంగల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు.
ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment