రోడ్డు ప్రమాదాలను నివారించండి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో మోటారు వాహనాల వినియోగం పెరుగుతుండగా ప్రమాదాలు సైతం అధికమవుతున్నాయని చెప్పారు. వాహనాలు కండిషన్‌గా లేకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నళ్లు పాటించక పోవడమే ఇందుకు కారణమని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించేందుకు పోలీసులు, ఆర్‌అండ్‌బీ, వైద్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. జాతీయ రహదారిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖాధికారులను ఆదేశించారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
మార్చి 5న ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. విద్యార్థులు కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయాలని అర్టీసీ అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులతో పాటు ఒక ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూ చించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ వెంకటేశ్వరా చారి, డీఐఈఓ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఒ భాస్కర్‌నాయక్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, టేకులపల్లి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సులోచనారాణి, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు శేషాంజన్‌స్వామి, శ్రీకాంత్, సుజాత పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
పలుగు, పార పట్టి.. మట్టి తట్ట ఎత్తి..
ఉపాధి కూలీలతో మమేకమైన కలెక్టర్
టేకులపల్లి: మండలంలోని సులానగర్, చింతలంక, కోయగూడెం, చంద్రుతండా, కొత్త తండా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ, ఫారం పాండ్ పనులను కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం పరిశీలించారు. సులానగర్ గ్రామంలో ఉపాధి కూలీలతో మాట్లాడి పని ప్రదేశంలో తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారా.. కూలి గిట్టుబాటు అవుతోందా అని ఆరా తీశారు. అనంతరం వారితో మమేకమై పలుగు, పార పట్టి మట్టి తవ్వారు. తట్టలో ఎత్తుతూ కూలీల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కోయగూడెంలో రైతు పకీర్ సాగు చేస్తున్న మునగ, చంద్రుతండాలో మరో రైతు ధర్మా సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునగ కాయలతో పాటు ఆకును పొడిచేసి అమ్మొచ్చని, లాభదాయకమైన ఈ పంట పండించి ఆర్థికాభివృద్ధి చెందాలని సూచించారు. ఆయన వెంట డీఎల్‌పీఓ రమణ, మిషన్ భగీరథ డీఈ పద్మావతి, విద్యుత్ శాఖ డీఈ రంగస్వామి, ఎంపీడీఓ రవీందర్ రావు, ఎంపీఓ గాంధీ, ఏపీఓ కాళంగి శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment