
మావోయిస్టులపై నిఘా ఉంచాలి
గుండాల: ఏజెన్సీలో మావోయిస్టులపై నిఘా ఉంచాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. క్రైమ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలపై నిఘా పెట్టాలని చెప్పారు. వాహనాల తనిఖీలు చేపట్టాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతీ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, టేకులపల్లి సీఐ సురేష్, ఆళ్లపల్లి ఎస్‌ఐ రతీష్ పాల్గొన్నారు.
మునగ సాగుతో
రైతులకు ఆదాయం
అశ్వారావుపేటరూరల్: మునగ పంట సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం వస్తుందని జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని ఆసుపాక గ్రామంలో రైతులు సాగు చేస్తున్న మునగ తోటను ఆయన పరిశీలించి మాట్లాడారు. మునగ పంటను పామాయిల్ తోటల్లో అంతర్ పంటగా సాగు చేసుకోవచ్చని, తద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఈ పంట సాగును మరింత విస్తరించాలని, ఆసక్తి ఉన్న రైతులు ఉపాధి హామీ పథకంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్, ఏఈవోలు రవీంద్ర, షాకీరా భాను, రైతులు పాల్గొన్నారు.
పొగాకు గ్రేడింగ్‌లో
జాగ్రత్తలు పాటించాలి
అశ్వారావుపేటరూరల్: వర్జీనియా పొగాకు గ్రేడింగ్‌లో జాగ్రత్తలు పాటించాలని జంగారెడ్డిగూడెం(ఏపీ) పొగాకు బోర్డు వేలం కేంద్రం సూపరింటెండెంట్ సురేంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పొగాకు తోటలను ఆయన సందర్శించారు. బ్యారన్ల వద్ద చేస్తున్న పొగాకు గ్రేడింగ్‌ను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం రైతుల సమావేశంలో మాట్లాడారు. కనీస మద్దతు ధర దక్కాలంటే తోటల సాగు, గ్రేడింగ్‌లో పద్ధతులు పాటించాలని, అధికంగా పురుగుల మందులను వినియోగించవద్దని చెప్పారు. సీనియర్ గ్రేడింగ్ అధికారి ప్రశాంత్, మాజీ పొగాకు బోర్డు మెంబర్ సుంకవల్లి వీరభద్రరావు, వేముల ప్రకాశ్‌రావు, కోడూరి నాగు, సతీష్, బ్రహ్మాజీ, పొగాకు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్లు
సూపర్‌బజార్(కొత్తగూడెం): తాగునీరు రాకపోయినా, పైపుల లీకేజీ ఉన్నా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 08744–241950 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్‌కాల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్‌ను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో టోల్‌ఫ్రీ నంబర్ 18005994007కు కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
క్విజ్, ఇన్నోవేషన్స్‌పై
విద్యార్థులకు పోటీలు
కొత్తగూడెంఅర్బన్: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 9, 10వ తరగతులు, ఇంటర్ విద్యార్థులకు క్విజ్, పోస్టర్, సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.వెంకటేశ్వరచారి, జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎస్.చలపతిరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నూతన ఆవిష్కరణలు, ఇండియా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ టెక్నాలజీ అనే అంశాలపై మాత్రమే పోస్టర్లు తయారు చేయాలని పేర్కొన్నారు. క్విజ్, పోస్టర్ పోటీలు ఈ నెల 27న పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం ఆధారం చేసుకుని ఎగ్జిబిట్ మోడల్స్, వర్కింగ్ మోడల్స్, ప్రాజెక్టులు రూపొందించుకోవాలని కోరారు. ప్రాజెక్టులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్‌లోడ్ చేయాలని సూచించారు. విజేతలుగా ఎంపికై నవారు రెండు రోజుల పాటు సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. వివరాల కోసం 040–29560518లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment