అకాల వర్షంతో రైతుల ఆందోళన
● ఈదురు గాలులకు నేలవాలిన మొక్కజొన్న ● పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం
దమ్మపేట/ములకలపల్లి/టేకులపల్లి/జూలూరుపాడు/చండ్రుగొండ: అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందారు. ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేలవాలింది. కల్లాల్లో ఉన్న మిర్చి రాశులు తడిసిపోతాయేమోనని ఉరుకులు, పరుగులతో పట్టాలు కప్పి పంటను కాపాడుకున్నారు. శుక్రవారం జిల్లాలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈదురుగాలులకు టేకులపల్లి మండలంలో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. మంగలితండాలో లకావత్ సురేష్‌కు చెందిన రెండెకరాలు, లకావత్ దేవాకు చెందిన ఐదు ఎకరాలు, బేతంపూడి, కుంటల్ల తదితర గ్రామాల్లో పలువురి రైతుల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. దమ్మపేట, జూలూరుపాడు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాల్లో చిరుజల్లులు కురవడంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంటను కాపాడుకునేందుకు నానాతంటాలు పడ్డారు. జూలూరుపాడు మండలంలో కల్లాల్లోని మిర్చి పాక్షికంగా తడిసింది. లైన్‌తండా, చింతలతండా, కరివారిగూడెం, కొమ్ముగూడెం, తవిసిగుట్టతండా, గిద్దలగూడెం, మాచినేనిపేట గ్రామాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ములకలపల్లి మండలంలో మేఘాలు దట్టంగా అలుముకోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. చండ్రుగొండ మండలంలో అరకొరగా చేతికొచ్చిన మిర్చి పంట అకాలవర్షంతో కొంతమేర దెబ్బతిన్నది.
Comments
Please login to add a commentAdd a comment