గణితం, ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించాలి
దుమ్ముగూడెం: గిరిజన విద్యార్థుల్లో గణితం, ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఇందుకోసం ఉద్దీపకం వర్క్ బుక్‌లు, వేదిక్ మ్యాథ్స్ పుస్తకాలను వినియోగించాలని తెలిపారు. దుమ్మగూడెం మండలం రామచంద్రునిపేట, రేగుబల్లి–2, ఏజీహెచ్‌ఎస్‌లను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. 3 నుంచి 5వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులు ఇంగ్లిష్, గణితం చదవడం, రాయడంలో వెనుకబడుతున్నందున ప్రాథమికస్థాయి నుంచే తీర్చిదిద్దాలని తెలిపారు. ఉద్దీపకం, వర్క్ బుక్‌లు పంపిణీ చేసినందున వీటి ఆధారంగా బోధిస్తూ విద్యార్థుల్లో భయాన్ని తొలగించాలని సూచించారు. కాగా, రామచంద్రునిపేట ఏజీహెచ్‌ఎస్ పాఠశాల ఏడో తరగతి విద్యార్థులతో పీఓ కొన్ని లెక్కలు చేయించడమే కాక వారితో పాటు కూర్చుని బోధనను పరిశీలించారు. అనంతరం ఫిజిక్స్, బయాలజీ ల్యాబ్‌లు, రేగుబల్లి–2 ఏజీహెచ్‌ఎస్‌లో విద్యుత్ సరఫరా తీరుపై ఆరా తీశారు. హెచ్‌ఎంలు బట్టు రాములు, భారతమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment