
నకిలీ నోట్లు డిపాజిట్ చేసిన వ్యక్తి అరెస్ట్
ఇల్లెందు: ఇల్లెందు ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లు డిపాజిట్ చేసి దొరికిపోయాడు. సీఐ బి.సత్యనారాయణ కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన పి.మల్లికార్జున్ (మధు) ఈ నెల 6వ తేదీన ఇల్లెందులోని ఆంబజార్ ఏటీఎంలో రూ.500 నోట్లు 10 డిపాజిట్ చేశాడు. అందులో 8 నోట్లు నకిలీవని గుర్తించిన బ్యాంకు అధికారులు ఆ ఏటీఎంలో సోదా చేశారు. సీసీ పుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించి డిపాజిట్ చేసింది మల్లికార్జున్(మధు)గా గుర్తించారు. మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఎల్లం చిన్నంనాయుడు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ సందీప్‌కుమార్ మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాకు కోడి పందేలకు వెళ్లినప్పుడు అక్కడి నుంచి తెచ్చిన నోట్లు తన ఖాతాలో డిపాజిట్ చేశాడని, అందులో 8 నోట్లు నకిలీవని తేలిందని, చేసి కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు.
29 మంది బైండోవర్
అశ్వారావుపేటరూరల్: అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని శుక్రవారం పోలీసులు స్థానిక తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. ఎస్‌ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏడాది కాలంగా ఇసుక అక్రమంగా రవాణా చేసి, కేసులు నమోదైన 29 మంది ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులను గుర్తించి వారిని స్థానిక తహసీల్ధార్ వనం కృష్ణప్రసాద్ ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు.
ప్రెజర్ బాంబు పేలి డీఆర్‌జీ జవాన్‌కు గాయాలు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో ప్రెజర్ బాంబు పేలి డీఆర్‌జీ జవాన్‌కు తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నారాయణపూర్ జిల్లాలోని చోటీడోంగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడిమెట్ట, కవ్నార్ ప్రాంతాల్లో డీఆర్‌జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. పోలీస్ బలగాలను లక్ష్యంగా చేసుకొని ఆ ప్రాంతంలో మావోయిస్టులు ప్రెజర్ బాంబులను ఏర్పాటు చేశారు. గమనించకుండా డీఆర్‌జీ జవాన్ ప్రెజర్ బాంబును తొక్కడంతో అది పేలి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చోటీడోంగర్‌కు తరలించి.. అక్కడ నుంచి నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు.
యువకుడి ఆత్మహత్య
ఇల్లెందు: పట్టణంలోని కొత్తకాలనీలో ఓ యువకుడు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన జక్కుల అరవింద్ (22) తన మేనమామ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పా ల్పడ్డారు. ఇంతకు ముందు కూడా అతడు పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సూర్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పురుగులమందు తాగి వ్యక్తి...
పాల్వంచరూరల్: కుమారుడిని మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఓ తండ్రి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తోగ్గూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన మొడి యం కృష్ణ (45).. కుమారుడు సాంబయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. శుక్రవారం పొలం వద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. గుర్తించిన ఆయన బంధువలు మహేశ్ పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతిడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
చికిత్స పొందుతున్న బాలిక మృతి
అశ్వారావుపేటరూరల్: కొద్ది రోజుల కిందట విద్యుదాఘాతానికి గురై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక శుక్రవారం మృతి చెందింది. ఎస్‌ఐ యయాతి రాజు కథనం మేరకు.. మండలంలోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన కేతా లాస్య (13) ఈ నెల 16న దుస్తులు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. తడి బట్టలను ఆరేస్తున్న క్రమంలో ఇంటిపై నుంచి వెళ్లిన 33 కేవీ విద్యుత్ లైన్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. బాలికను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదారాబాద్ తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ చెప్పారు. బాలిక తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యయాతి రాజు పేర్కొన్నారు.

నకిలీ నోట్లు డిపాజిట్ చేసిన వ్యక్తి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment