ఖమ్మంమయూరిసెంటర్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా రాష్ట్రప్రభుత్వం వివిధ పథకాల్లో స్థానం కల్పిస్తోంది. ఇప్పటికే ఇందిరా మహిళ శక్తి పేరుతో క్యాంటీన్లు మంజూరు చేస్తుండగా, తాజాగా ఆర్టీసీ అద్దెకు తీసుకునే బస్సులను మహిళా సంఘాల నుంచే సమకూర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 600 బస్సులను ఈ విధానంలో సేకరించాలనేది లక్ష్యం కాగా, మొదటి దశలో 150 బస్సులను మహిళా సమాఖ్యలకు రుణాల మంజూరు ద్వారా కొనుగోలు చేయిస్తారు. ఈక్రమాన రుణాలు మంజూరు చేసే బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తు ఇస్తుంది. కాగా, మొదటి దశలో కొనుగోలు చేసే 150బస్సుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మహిళా సమాఖ్యలకు సైతం స్థానం దక్కనుంది. సుమారు 30 – 35 బస్సులను ఇక్కడి మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగిస్తారు. ఆపై ఆర్టీసీ ఒక్కో బస్సుకు రూ.77,220 చొప్పున అద్దె చెల్లిస్తుంది. ఇందులో కొంత మేర రుణవాయిదాలు చెల్లిస్తూ మిగతా నగదును సమాఖ్య సభ్యులుగా వాటాలు తీసుకుంటారు. కాగా, ఈనెల 8న మహిఽళా దినోత్సవం రోజునే 50బస్సులను ప్రభుత్వం ప్రారంభించనుండగా, జిల్లాలో మహిళా సమాఖ్యలను ఎంపిక చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
మొదటి దశలోనే ఉమ్మడి జిల్లాకు స్థానం
Comments
Please login to add a commentAdd a comment