సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులకు మెరుగైన, ఉత్తమ సేవలు అందించేందుకే పొలం బాట కార్యక్రమంతో తమ శాఖ అధికారులు నేరుగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తున్నారని విద్యుత్ ఎస్‌ఈ జి.మహేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు 137 పొలంబాట కార్యక్రమాలు నిర్వహించామని, ఒరిగిన స్తంభాలు 1,396, 1,047 లూజ్‌లైన్లు, 874 మధ్య స్తంభాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురి కాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మోటార్లకు కెపాసిటర్లు పెట్టుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కెపాసిటర్లు అమర్చడం ద్వారా మోటార్లు మరింతకాలం మన్నికగా ఉంటాయని తెలిపారు. లో ఓల్టేజీ సమస్య కూడా ఉండదన్నారు. ఆటోస్టార్టర్లు కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ప్రమాదాలు లేకుండా చూడడమే లక్ష్యంగా సర్కిల్ పరిధిలో డీఈ, టెక్నికల్ అధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించామని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై విస్తృత ప్రచారం చేసి రైతులను చైతన్యం చేస్తున్నామని వివరించారు. రైతులు, వినియోగదారులు సొంతంగా విద్యుత్ పనులు చేయకూడదని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 1912 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.
విద్యుత్ ఎస్‌ఈ మహేందర్
Comments
Please login to add a commentAdd a comment