బియ్యం దందాను ఆపేదెవరు? | - | Sakshi
Sakshi News home page

బియ్యం దందాను ఆపేదెవరు?

Published Wed, Mar 5 2025 12:24 AM | Last Updated on Wed, Mar 5 2025 12:23 AM

బియ్యం దందాను ఆపేదెవరు?

బియ్యం దందాను ఆపేదెవరు?

సూత్రధారులు ఎవరు?

తెలంగాణ నుంచి కాకినాడ షిప్‌యార్డుకు అక్రమంగా చేర్చిన బియ్యాన్ని అక్కడి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గుర్తించి ‘సీజ్‌ ద షిప్‌’ అని చెప్పడం.. ఆతర్వాత పరిణామాలూ అందరికీ తెలిసిందే. అలాగే, అశ్వారావుపేటలో ఆ స్థాయిలో హంగామా లేకున్నా విడతల వారీగా లారీల సీజ్‌ జరుగుతోంది. కొన్నాళ్లకు అంతా సవ్యంగానే సాగుతోందని చెబుతున్నారు. అయితే, దందాకు సూత్రధారులెవరు, అక్రమ రవాణాకు సులభ దారులు ఏమిటనే అంశాలను గత కేసులను ఆధారంగా పోలీసులు, ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సివిల్‌ సప్లయీస్‌ డీటీ గుర్రం ప్రభాకర్‌ను వివరణ కోరగా లారీలను తనిఖీ చేసే అధికారం తమకు ఉందని తెలిపారు. కానీ శాశ్వత చెక్‌పోస్టు ఏర్పాటు అంశంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

అశ్వారావుపేట: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అశ్వారావుపేట మీదుగా ఆంధ్రాకు బియ్యం తరలించే వారి దందా అప్పుడప్పుడే వెలుగులోకి వస్తోంది. రేషన్‌, లెవీ, సీఎంఆర్‌ బియ్యం ఇలా ప్రభుత్వ ఆధీనంలో ఉండే పలు రకాల బియ్యం అశ్వారావుపేట మీదుగా అక్రమంగా రవాణా చేస్తుండగా, విజిలెన్స్‌ అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తేనో.. వారికి తీరిక ఉన్నప్పుడు మాత్రమే తనిఖీలు చేపడుతున్నారు. ఈ సమయాన లారీలు పట్ట్టుబడుతుండగా మిగతా సమయాల్లో స్థానిక సివిల్‌ సప్లయీస్‌ అధికారుల తనిఖీలు లేక అక్రమార్కులు యథేచ్ఛగా బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. గతంలో మహబూబాబాద్‌ ప్రాంతానికి చెందిన మిల్లర్ల మధ్య ఐక్యత లోపించి ఒకరికి చెందిన బియ్యం లారీలను అశ్వారావుపేట పోలీసులు, విజిలెన్స్‌ అధికారులకు పట్టించారు. ఆ తర్వాత మరోమారు ఇలాగే జరిగింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే అక్రమ మార్గాల్లో సేకరించిన బియ్యాన్ని అశ్వారావుపేట మీదుగానే సరిహద్దు దాటించాల్సి ఉంటుంది. కానీ విజిలెన్స్‌ అధికారులు మాత్రమే దాడులు చేస్తుండగా, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు సరిహద్దులో చెక్‌పోస్టు ఎందుకు ఏర్పాటు చేయడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడప్పుడే తనిఖీలు

గడిచిన పదిహేనేళ్లలో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పుడు ఈ తరహా తనిఖీలు జరుగుతున్నాయి. అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం లారీలను అడ్డుకునే క్రమాన మొదటి మూడు, నాలుగు లారీలకు సరైన పత్రాలు లేవని చెప్పడం.. మిగతా లారీలను వదిలేయడం షరామామూలుగా మారింది. లారీల యజమానులు చెప్పిన మాట వినడం తప్ప స్థానిక అధికారులు, పోలీసులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. లారీల యజమానులు, మిల్లర్లు, అధికారులు ఇలా మూడు నెట్‌వర్క్‌ల మధ్య అంతా సవ్యంగా ఉంటే సరి.. ఎక్కడైనా తేడా వచ్చినప్పుడు అశ్వారావుపేట దాటకముందే లారీలు పట్టుబడుతున్నాయని చెబుతున్నారు. అయితే, లారీలను సీజ్‌ చేసిన సమయాన తప్ప మిగతా సమయంలో అక్రమ రవాణా జరగడం లేదా అంటే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే, అశ్వారావుపేటలో మాత్రమే బియ్యం లారీలను సీజ్‌ చేస్తుండగా వందల కి.మీ. దాటి వచ్చ క్రమాన ఎందుకు తనిఖీలు చేయడం లేదో అధికారులే చెప్పాలి ఉంటుంది. గత శుక్రవారం అశ్వారావుపేటలో విజిలెన్స్‌ అధికారులు 12 లారీలను ఆపి పోలీసులకు అప్పగించారు. ఈ తర్వాత పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయని తొమ్మిది లారీలను పంపించి, కేవలం మూడు లారీలనే సీజ్‌ చేయడం గమనార్హం.

విడతల వారీగా విజిలెన్స్‌ దాడులు

సాధారణ తనిఖీల లేక అక్రమార్కుల ఇష్టారాజ్యం

చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేస్తేనే ఫలితం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement