లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించొద్దు..
గుండాల/పాల్వంచరూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని, దానిని సాధించే వరకు విశ్రమించొద్దని ఐటీడీఏ డీడీ మణెమ్మ సూచించారు. మంగళవారం ఆళ్లపల్లి మండలం అనంతోగు, పాల్వంచ మండలం ఉల్వనూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్‌పై సమీక్ష నిర్వహించారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించాలని, అనంతరం చదువు మధ్యలో ఆపకూండా పైచదువులకు వెళ్లాలని సూచించారు. ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ఇలా.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కోర్సులను ఎంచుకోవాలని సూచించారు. వేసవి సెలవలను వృథా చేయకుండా నైపుణ్యం ఉన్న రంగాల్లో శిక్షణ తీసుకోవాలని చెప్పారు. పోలీస్, ఫారెస్ట్, వైద్య, విద్యుత్ శాఖ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇల్లెందు ఏటీడీఓ రాధమ్మ, హెచ్‌ఎం భద్రమ్మ, ప్రత్యేకాధికారి మధుకర్, పాల్వంచ తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఎంఈఓ శ్రీరాంమూర్తి, ఏఓ శంకర్, డాక్టర్ తేజశ్రీ, డీఈ సుధా, ఎస్‌ఐ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం గోదావరి వద్ద గజ ఈతగాళ్ల ఏర్పాటు
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని గోదావరిలో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు మంగళవారం అధికారులు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల నీటమునిగి పలువురు భక్తులు మృతి చెందిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశాల మేరకు ప్రమాదాలు అరికట్టేందుకు భద్రాచలం ఆర్డీఓ దామోదర్‌రావు పంచాయతీ, రామాలయ అధికారులతో సమావేశం నిర్వహించి నలుగురు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
సౌర విద్యుత్ ప్లాంట్లకు దరఖాస్తు గడువు పెంపు
ఖమ్మంవ్యవసాయం: రైతులు తమ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగించారు. పీఎం కుసుమ్ పథకం కింద వ్యవసాయ యోగ్యం కాని బీడు, బంజర భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులతో పాటు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, వివిధ సంస్థలకు సైతం అవకాశం కల్పించారు. అయితే, దరఖాస్తు గడువు 2వ తేదీతో ముగియగా ఉమ్మడి జిల్లాలో 75 మంది ముందుకొచ్చారు. ఈనేపథ్యాన గడువు పెంచగా, ఆసక్తి ఉన్న రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రెడ్‌కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పి.అజయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
‘వనజీవి’ని కలిసిన
బీట్ ఆఫీసర్లు
ఖమ్మంరూరల్: మండలంలోని రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యను రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ 35వ బ్యాచ్‌కు చెందిన 40మంది ఫారెస్ట్ ట్రైనింగ్ బీట్ ఆఫీసర్లు మంగళవారం కలిశారు. ఈసందర్భంగా విత్తనాల సేకరణ, మొక్కలు నాటడం, పరిరక్షణపై తన అనుభవాలను రామయ్య వివరించారు. మొక్కలు నాటడమే కాక అడవులను నరికివేయకుండా అడ్డుకోవడాన్ని అందరూ బాధ్యతగా భావించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అటవీ అకాడమీ కోర్సు డైరెక్టర్ గంగారెడ్డి, కూసుమంచి రేంజ్ ఆఫీసర్ పి.శ్రీనివాసరావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కే.వీ.రామారావుతో పాటు ఉద్యోగులు కొండల్‌రావు, పి.డానియేల్, వెంకటేశ్వర్లు, నర్సింహారావు, మధు తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో
ఉపాధ్యాయురాలు మృతి
దమ్మపేట: మండలంలోని నాగుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న హ సవత్ కిరణ్మయి (36) మంగళవారం రాత్రి కొత్తగూడెం ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందింది. కిరణ్మయి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం నిమిత్తం ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఆమె మంగళవారం కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందారు. ఎంఈఓ కీసర లక్ష్మి, స్థానిక ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.
లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించొద్దు..
లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించొద్దు..
Comments
Please login to add a commentAdd a comment