ఎర్రచందనం చెట్లు నరికివేత
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం శివారులో మంచె రమేశ్‌కు చెందిన 20 ఎర్రచందనం చెట్లను ట్రాన్స్‌కో అధికారులు మంగళవారం నరికివేశారు. కొమరారం సబ్‌స్టేషన్ నుంచి హెచ్‌టీ లైన్ కింది భాగంలో ఏపుగా పెరిగిన చెట్లను రెండు రోజులుగా ట్రాన్స్‌కో అధికారులు తొలగించే పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఎర్రచందనం చెట్లు విద్యుత్ తీగలకు కింది భాగంలో ఉండటంతో రెండు వరుసలలో 20 చెట్లను పూర్తిగా నరికివేశారు. ఇదిలాఉండగా తాము మొక్కలు నాటిన తరువాతే ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ లైన్ వేశారని, గతంలో తీగల కింద భాగంలో చెట్లు నరికే క్రమంలో నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునేవారని, ప్రస్తుతం చెట్లను పూర్తిగా తొలగించి తమకు భారీ నష్టం చేశారని రైతు రమేశ్ వాపోయాడు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరాడు. ఇదే విషయమై ట్రాన్స్‌కో ఏడీఈ కోటేశ్వరరావును వివరణ కోరగా.. నిబంధనలకు లోబడి విద్యుత్ సరఫరాలో అవాంతరాలను అధిగమించేందుకు హెచ్‌టీ లైన్ కింది భాగంలో ఉన్న చెట్లను తొలగించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment