నేటి నుంచి పగిడిద్దరాజు జాతర
గుండాల: మేడారం సమ్మక్క భర్త, అరెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు జాతర మండలంలోని యాపలగడ్డ గ్రామంలో బుధవారం ప్రారంభం కానుంది. మేడారం జాతర అనంతరం ఇక్కడ సమ్మక్క – పగిడిద్దరాజుల నాగవెల్లి జాతర నిర్వహించడం ఆనవాయితీ. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు గ్రామ సమీపంలోని గద్దెల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు పగిడిద్దరాజును వనం(గుట్ట) నుంచి గుడికి తీసుకొచ్చి, రాత్రి ఎదురిల్లుట చేస్తారు. గురువారం వన దేవతను గుట్ట నుంచి తీసుకొస్తారు. దీంతో జాతర ప్రారంభమవుతుంది. పలు కార్యక్రమాల అనంతరం శనివారం ఉదయం దేవతలను గుట్టకు సాగనంపడంతో జాతర ముగుస్తుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, ములుగు జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. కాగా, పగిడిద్ద రాజు జాతరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు పినపాక, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment