రంగం సిద్ధం
‘నవమి’
టెండర్లకు
ఫాల్గుణ మాసంలో ప్రత్యేక పూజలు..
ఫాల్గుణ మాసం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరపనున్నారు. ఈనెల 10వ తేదీన పుష్యమి నక్షత్రం సందర్భంగా పట్టాభిషేకం, 13న వసంతోత్సవం, డోలోత్సవాలకు అంకురార్పణ, 14న పసుపు, కుంకుమలను దంచి పెళ్లి పనులకు శ్రీకారం, వసంతోత్సవం జరపనున్నారు. ఇదే రోజున స్వర్ణ లక్ష్మీ అమ్మవారికి స్నపన తిరుమంజనం గావించనున్నారు. 17న సుదర్శన హోమం, 25న సర్వ ఏకాదశి సందర్భంగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు వైదిక పెద్దలు తెలిపారు.
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవోపేతంగా జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు హడావిడి ప్రారంభమైంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి, 7వ తేదీన పట్టాభిషేక మహోత్సవాలు జరగనుండగా, ఈ బ్రహ్మోత్సవాలను సుమారు 2.50 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలోనే టెండర్లు..
ప్రతి ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలకు ఫిబ్రవరి నెలాఖరు వరకే టెండర్లు ఖరారు కావడంతో పాటు పనులు ప్రారంభమయ్యేవి. అయితే ఈ ఏడాది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో టెండర్లు ఖరారు చేయకున్నా.. యాక్షన్ ప్లాన్ మాత్రం సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో పనుల వ్యయాన్ని ప్రకటించి టెండర్లు పిలిచేలా ప్రణాళిక రూపొందించారు. కాగా నవమి బ్రహ్సోత్సవాలకు కేటాయించిన రూ.2.50 కోట్లలో రూ. 1.50 కోట్ల వరకు భక్తులకు ఏర్పాటు చేసే వసతులు, రామాలయం, పర్ణశాల ఆలయానికి రంగులు, విద్యుత్ దీపాలంకరణ, మిథిలా స్టేడియంలో బారికేడ్లు, కూలర్లు, తాత్కాలిక వసతి ఇతరత్రా పనులకు వెచ్చించనున్నారు. మరో రూ.కోటితో స్వామి వారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు, పూల అలంకరణ, క్రతువుకు సంబంధించి వ్యయం చేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో టెండర్లను ఆహ్వానిస్తే ఈ పనులకు లైన్ క్లియర్ అవుతుంది. ఇక కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి సామాన్య భక్తులకు అందాల్సిన వసతులు, కల్యాణ వీక్షణంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.
హోలీ నుంచి పెళ్లి పనులు..
ఈనెల 14న హోలీ పండుగ రోజున రామాలయంలో స్వామివారి పెళ్లి పనులు ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ పౌర్ణమి రోజున పసుపు కొమ్ములు దంచి తలంబ్రాల తయారీతో పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్ద ఈ వేడుకలను గత రెండు సంవత్సరాలుగా జరుపుతున్నారు. భద్రాచలంలో మాత్రమే ప్రత్యేకమైన తలంబ్రాల తయారీ ఎంతో విశిష్టమైనది. భక్తులు సమర్పించిన బియ్యంలో పసుపు, రోజ్‌వాటర్, గులామ్, సుగంధద్రవ్యాలు, అత్తర్ కలిపి తలంబ్రాలు తయారు చేస్తారు. నిజాం నవాబుల నాటి సంప్రదాయాన్ని ఇప్పటికీ భద్రాచలం రామాలయంలో కొనసాగిస్తున్నారు. ఇదే రోజున స్వామి వారికి వసంతోత్సవం నిర్వహించనున్నారు. కాగా ప్రతి ఏడాది భక్తుల నుంచి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ముత్యాల తలంబ్రాలను సైతం ఈ ఏడాది పెంచనున్నారు. ఆలయ విక్రయశాలతో పాటు పోస్టాఫీస్‌లో, ఆర్‌టీసీ కార్గో ద్వారా విక్రయించనున్నారు. అదేవిధంగా ఈనెల 30వ తేదీ ఉగాది పండుగ రోజున బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 30 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు శాస్త్రోక్త కార్యక్రమాలు, 6వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 7వ తేదీన పట్టాభిషేకం జరగనున్నాయి.
ఒకటి, రెండు రోజుల్లో ఆహ్వానం
రూ.2.50 కోట్లతో చేపట్టనున్న పనులు
ఈనెల 14న రామయ్య పెళ్లి పనులు షురూ
30 నుంచి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
ఏప్రిల్ 6న శ్రీరామ నవమి, 7న పట్టాభిషేకం
రంగం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment