ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పెట్రోల్ బంక్‌లు..
● బ్యాంక్ రుణాలతో ఏర్పాటుకు అవకాశం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి
సూపర్‌బజార్(కొత్తగూడెం): స్వయం సహాయక బృందాల సభ్యులు పెట్రోల్ బంక్‌లు నిర్వహించేలా వారికి బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి పలు శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. పెట్రోల్ బంకుల స్థాపనకు రహదారుల వెంట 10 కుంటల స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సదరం సేవలను సులభతరం చేస్తూ ఇటీవల కొత్తగా యూడీఐడీ పోర్టల్ ప్రవేశపెట్టినందున దివ్యాంగులకు దీనిపై అవగాహన కల్పించాలని చెప్పారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి కూల్చివేయాలని, వేసవి సెలవుల్లో నూతన భవనాలను నిర్మిస్తామని అన్నారు. పెండింగ్ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, ఆర్‌ఎంఓ రమేష్, మిషన్ భగీరథ ఈఈలు నళిని, తిరుమలేష్, భద్రాచలం డీఎల్‌పీఓ సుధీర్, సహాయ కార్మిక శాఖాధికారి ఫకృద్దీన్ పాల్గొన్నారు.
పరీక్షలు ప్రశాంతంగా రాయాలి
ఇంటర్ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని, తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కానివ్వొద్దు..
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక అయ్యప్పస్వామి ఆలయం పక్కన గల ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన భూమి ఎంత, వాస్తవంగా అక్కడ ఉన్నది ఎంత అనే వివరాలు సేకరించాలని ఆర్డీఓకు సూచించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉన్నందున ప్రభుత్వ భూముల వివరాలు నమోదు చేయాలన్నారు.
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కొత్తగూడెంఅర్బన్: ఈనెల 21న ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఐడీఓసీలో డిపార్ట్‌మెంటల్ అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జిల్లాలో 73 కేంద్రాల్లో 12,282 మంది రెగ్యులర్, 686 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎవరూ అలసత్వం వహించొద్దని సూచించారు. సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు కేంద్రాల్లోకి అనుమతించవద్దని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు తదిరులు పాల్గొన్నారు.
రైల్వే ట్రాక్ నిర్వాసితులతో సమావేశం
మణుగూరు టౌన్: బీటీపీఎస్ రైల్వే ట్రాక్ నిర్వాసితులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మణుగూరులో మంగళవారం సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాగా తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ లేదా ఉద్యోగం లేదంటే కంపెనీ లాభాల్లో వాటా ఇవ్వాలని కోరారు. అయితే ఎక్కువ మొత్తంలో భూమి సేకరిస్తేనే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం 100 పడకల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం సూపరింటెండెంట్ సునీల్ మజ్నేకర్ ఆస్పత్రిలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా..నివేదిక అందిస్తే ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఇటీవల మెగా కంటి వైద్యశిబిరం నిర్వహించి 1,075 మందికి కంటి ఆపరేషన్లు చేయించిన నేత్ర వైద్య సహాయకులు గంజికుంట్ల సంజీవరావును అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ పడవ ప్రయాణం..!
మణుగూరు టౌన్ : కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం పడవ ప్రయాణం చేశారు. మణుగూరు మండలం మల్లేపల్లి వద్ద పడవ ఎక్కిన కలెక్టర్.. మధ్యలో కొంతదూరం ఇసుకలో కాలినడకన, మరి కొంతదూరం బైక్‌పై, ఆ తర్వాత మళ్లీ పడవలో చర్ల మండలం పెద్దిపల్లి వరకు వెళ్లారు. వీరాపురం, మొగళ్లపల్లి, చింతకుంట గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఇసుక ద్వారా ఎంత ఆదాయం వస్తోందని టీఎస్‌ఎండీసీ, రెవెన్యూ, మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట చర్ల తహసీల్దార్ శ్రీనివాస్, మైనింగ్ శాఖ అధికారి దినేష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment