పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
● జిల్లాలోని 36 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ● ఐదు నిమిషాల వెసులుబాటుతో విద్యార్థుల్లో ఆనందం ● హాజరుకానున్న 19,228 మంది ● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్ పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి జరిగే ఈ పరీక్షలకు జిల్లాలో 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 9,225 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 10,003 మంది.. మొత్తం 19,228 విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 8.30 గంటల వరకే కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. అయితే ఈ ఏడాది పరీక్ష సమయం ముగిసిన ఐదు నిమిషాల వరకు కూడా అనుమతిస్తామని రాష్ట్రస్థాయి అధికారులు ప్రకటించడంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కొత్తగూడెంలోని ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ఈ సంవత్సరం కొత్తగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులతో పాటు మూడు సిట్టింగ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, కస్టోడియన్ అధికారులు ఐదుగురు, 550 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్రాల వద్ద విద్యార్థులకు వైద్య సహాయం అందించేందుకు 72 మంది ఏఎన్‌ఎంలను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
కేంద్రాల్లో వసతుల కల్పన..
ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కళాశాలల సిబ్బంది మంగళవారమే పరీక్ష కేంద్రాల్లో హాల్‌టికెట్ నంబర్లు వేశారు. విధులు కేటాయించిన సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆయా సెంటర్లలో రిపోర్ట్ చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్ష రాసే గదుల్లో ఫ్యాన్లు, సరిపడా వెలుతురు ఉండేలా లైట్లు ఏర్పాటు చేశారు. సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపించనున్నారు. ఇంకా వైద్యారోగ్య, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సేవలు అందించనున్నారు. ఆయా కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment