కరకగూడెం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కరకగూడెం ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మోతే గ్రామానికి చెందిన నైనారపు సాగర్ (30) ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యాన ఈనెల 9న ఇంటి వద్ద కుటుంబసభ్యులతో గొడవపడి క్షణికావేశంలో పురుగుల మందు తాగాడు. దీంతో అతడికి కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడ నుంచి మణుగూరు వైద్యశాలకు, చివరకు వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఇటీవల అతడు ఇంటికి తీసుకుని రాగా గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య నాగేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేందర్ తెలిపారు.
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
ఇల్లెందురూరల్: మండలంలోని బోయితండా గ్రామపంచాయతీ ఎల్లన్ననగర్ గ్రామంలో ఆటాడుకుంటున్న ఏడాదిన్నర వయసు గల ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను కుటుంబసభ్యులు ఇలా తెలిపారు. గ్రామంలో వాంకుడోత్ రాములు తన ట్రాక్టర్‌ను ఇంట్లో ఓ పక్కకు పెట్టే ప్రయత్నంలో అక్కడే ఆడుకుంటున్న రాములు సోదరుడు శ్రీకాంత్– కల్యాణి దంపతుల కుమారుడు ఆర్యన్ మీదకు ఎక్కించాడు. దీంతో కుటుంబసభ్యులు బాలుడిని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి భౌతికకాయాన్ని మార్చురీకి తరలించారు. కనుల మందు అల్లారుముద్దుగా ఆడుకుంటున్న బాలుడు హఠాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.
చికిత్స పొందుతున్న మహిళ..
అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన మామిడి సామ్రాజ్యం(40) పురుగుమందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందులతో సామ్రాజ్యం గత రెండు రోజుల క్రితం పురుగుమందు తాగింది. అస్వస్థతకు గురికావడంతో ఆమెను కుటుంబసభ్యులు భద్రాచలం ఆస్పత్రికి, ఆపై ఖమ్మంకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈమేరకు మృతదేహానికి మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు సీఐ అశోక్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
సత్తుపల్లి టౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం కాకర్లపల్లి లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్వరరావు (35) ద్విచక్ర వాహనంపై సత్తుపల్లిలోని ఒక షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న తన భార్యను తీసుకెళ్లేందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో కాకర్లపల్లి శివారులోని పాత ఎన్టీఆర్ కాలువ వంతెన సమీపంలో ఓ పానీపూరి బండిని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇతడు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య భవాని, ఒక కుమార్తె ఉన్నారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య