
ముత్యాలమ్మ గుడిలో కూలిన వందేళ్ల చెట్టు
పాల్వంచ: పట్టణంలోని గాంధీనగర్‌లోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలోని వందేళ్లకు పైబడిన పాల చెట్టు గురువారం రాత్రి కూలింది. రెండు రోజుల కిందట వీచిన గాలికి చెట్టు కొంత వరకు ఒరిగింది. గురువారం మొత్తం కూలి ముత్యాలమ్మ గుడిపై పడటంతో ధ్వసమైంది. పక్కనే ఉన్న రెండు రేకుల ఇళ్లపై కూడా పడటంతో దెబ్బతిన్నాయి. ఇంటి బయట పడుకున్న బాగం సుకన్య, సుగుణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనను మున్సిపల్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్‌రావు, రెవెన్యూ ఆర్‌ఐ తదితరులు సందర్శించారు.
పాఠశాలలో
తప్పిన ప్రమాదం
వంటగది స్లాబ్ పెచ్చులు ఊడి పడి
వంటమనిషికి గాయాలు
టేకులపల్లి: మండలంలోని బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలలోని వంట గది స్లాబ్ పెచ్చులు ఊడి వంటచేస్తున్న మహిళపై పడ్డాయి. వంటలపైనా పడటంతో అవి దెబ్బతిన్నాయి. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పెచ్చులు ఊడి పడుతున్న సమయంలో అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి వంటమనిషి సరోజ బయటపడింది. కానీ, ఆమె చేతికి గాయమైంది. శిథిలావస్థలో ఉన్న కిచెన్‌షెడ్‌కు మరమ్మతులు చేయాలని గత డిసెంబర్ 31న జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో తీర్మానం చేసి, ఉన్నతాధికారులకు పంపించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఎస్పీ ఆకస్మిక తనిఖీ
ములకలపల్లి: ములకలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ రోహిత్‌రాజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు అర్ధగంట పాటు పోలీస్ స్టేషన్లో గడిపిన ఎస్పీ.. క్రైం వివరాలు, కేసుల తాలూకూ రికార్డులు పరిశీలించారు. ఈ విషయమై ఎస్‌ఐ కిన్నెర రాజశేఖర్‌ను వివరణ కోరగా సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్పీ స్టేషన్‌ను సందర్శించినట్లు తెలిపారు. ఎస్పీ వెంట పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ ఉన్నారు.
వేధింపులపై
ఏఎస్పీకి ఫిర్యాదు
భద్రాచలంటౌన్: చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న ఆశ వర్కర్‌ను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్న ఘటనపై బాధితురాలు శుక్రవారం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. చర్లలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న పందా రమేశ్ కొంతకాలంగా ఆశ వర్కర్‌ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధితురాలు అతని భార్య, అత్తలకు విషయం చెప్పింది. దీంతో రమేశ్ అలా ఎందుకు చెప్పావని వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న బాధితురాలిని దుర్భాషలాడుతూ దాడి చేశాడు. చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో తనకు ప్రాణహాని ఉందని, రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన్నట్లు ఆశ్వ వర్కర్ తెలిపారు.
మహిళ అదృశ్యంపై కేసు
టేకులపల్లి: వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐ సురేశ్ కథం ప్రకారం.. టేకులపల్లి మండలం చింతలంక గ్రామానికి చెందిన ప్రమీలకు ఇదే గ్రామానికి చెందిన గుమ్మడి సుధాకర్‌తో కొన్నేళ్ల కిందటే వివాహమైంది. కొంతకాలంగా ప్రమీల తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ నెల 1వ తేదీన ఇంట్లో తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం వెతికినా దొరక్కపోవడంతో శుక్రవారం బాధితురాలి తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కొనసాగుతున్న
అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు
తల్లాడ: మండలం కుర్నవల్లిలో నిర్వహిస్తున్న ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం రెండోరోజుకు చేరాయి. వేంకటాచలపతి దేవాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యాన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు జరిగిన మ్యాచ్‌లో ఏపీలోని వైజాగ్ జట్టుపై తమిళనాడు జట్టు విజయం సాధించింది. శనివారం పోటీలు ముగియనుండగా, విజేతలకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

ముత్యాలమ్మ గుడిలో కూలిన వందేళ్ల చెట్టు