
మందు.. ‘ఫుల్’ ఆదాయం
● 2023–24తో పోలిస్తే 24–25లో పెరిగిన అమ్మకాలు ● 2024 మే నెలలో రూ.237 కోట్ల మద్యం అమ్మకాలతో రికార్డు ● మొత్తంగా ఆర్థిక సంవత్సరంలో రూ.2,294 కోట్ల సేల్స్
వైరా: మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతుండగా.. ప్రభుత్వానికి అంతే మొత్తంలో ఆదాయమూ పెరుగుతోంది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో వైరాలోని ఐఎంఎల్ డిపో ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైన్స్, బార్లకు రూ.2,294 కోట్ల విలువైన మద్యం సరఫరా కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో 210 వైన్స్, మూడు క్లబ్‌లు, 50 బార్లు ఉన్నాయి. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,281 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2024–25కు వచ్చేసరికి అమ్మకాలు మరింత పెరిగాయి. సహజంగా ఏటా వేసవిలో బీర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇందులో భాగంగానే గత ఏడాది మే నెలలో రూ.237 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ నెలలో శుభకార్యాలు ఉండటం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఏపీలో ఎన్నికల నేపథ్యాన ఇక్కడి నుంచి మద్యం సరఫరా అయిందని తెలుస్తోంది. ఇక గత ఏడాది సెప్టెంబర్ 30న ఒకేరోజు 45 వేల కేసుల మద్యం, 16,500 కేసుల బీర్లు అమ్ముడవడం.. వీటి విలువ రూ.33 కోట్లు ఉండడం విశేషం.
పెరిగిన బీర్ల ధరలు.. తగ్గిన డిమాండ్
ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచడంతో వేసవిలో బీర్ల అమ్మకం ఎలా ఉంటుందోనని మద్యం షాపుల యజమానుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీర్లకు అంతగా డిమాండ్ లేనట్లు ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో స్ట్రాంగ్ బీర్ ధర రూ.160 ఉండగా ఇ ప్పుడు రూ.190కి, లైట్ బీరు రూ.150 నుంచి రూ.180 కి చేరింది. గతంలో రోజుకు 8 వేల నుంచి 10 వేల కేసులు అమ్ముడయ్యే బీర్లు 7 వేల కేసులు దాటడం లేదని చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి పెరిగిన బీర్ల ధరలు అమల్లోకి రాగా ఈ నెల 11వ తేదీ వరకు రూ.60 కోట్ల విలువైన 2,92,000 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అయితే, బీర్లకు డిమాండ్ తగ్గినా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం గణనీయంగా నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
2024–25 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు
నెల విక్రయాలు (రూ.కోట్లలో)
2024 ఏప్రిల్ 181
మే 237
జూన్ 210
జూలై 180
ఆగస్టు 196
సెప్టెంబర్ 184
అక్టోబర్ 152
నవంబర్ 134
డిసెంబర్ 225
2025 జనవరి 201
ఫిబ్రవరి 181
మార్చి 201
మొత్తం రూ.2,294