
గిన్నిస్ బుక్‌లో సంపత్‌నగర్‌వాసికి చోటు
టేకులపల్లి: మండలంలోని సంపత్ నగర్ గ్రామానికి చెందిన కుడితేటి రమేష్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన హోలెల్ మ్యూజిక్ స్కూల్ ప్రోత్సాహంతో క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్‌లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో అతను పాల్గొన్నాడు. ఏకకాలంలో 1,090 మంది సంగీత కళాకారులు కీ బోర్డు ప్లే చేశారు. వారిలో 1,046 మంది సుమారు నిమిషం నిడివి కలిగిన వీడియో క్లిప్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ కూడా ప్రతిభ చూపి రికార్డు సాధించాడు. నిర్వాహకులు మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేశారు.
10 మంది స్పౌజ్
ఉపాధ్యాయుల బదిలీ
ఖమ్మంసహకారనగర్: గత ప్రభుత్వ హయాంలో 317 జీఓ ద్వారా ఉపాధ్యాయ దంపతుల్లో ఒక్కొక్కరు ఒక్కో జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో వీరికి స్పౌజ్ కేటగిరీ ద్వారా బదిలీకి అవకాశం కల్పించగా రాష్ట్రంలో 165మంది ఉపాధ్యాయులను వారి భాగస్వామి పనిచేస్తున్న జిల్లాలకు కేటాయించారు. ఇందులో పది మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానుండగా, అంతే సంఖ్య ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు వెళ్లనున్నారు. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు విడుదల చేయడంపై టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆయా ఉపాధ్యాయులు ఈనెల 22న ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ అయి.. 23న కొత్త జిల్లాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఎస్సీ కమిషన్ సభ్యుడిని కలిసిన నాయకులు
సింగరేణి(కొత్తగూడెం): జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్‌ను ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్‌లో బుధవారం సింగరేణి కాలరీస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సమస్యలపై త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. విజిలెన్స్ అఽధికారుల వేధింపులు, ప్రమోషన్లు పెండింగ్‌లో పెట్టడం వంటివి సరికాదని అన్నారు. అసోషియేషన్ నాయకులు ఆంతోటి నాగేశ్వరరావు, ఆరెపల్లి రాజేందర్, బందెల విజేందర్, మొగిలిపాక రవికుమార్, చెరిపెల్లి నాగరాజు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
అశ్వాపురం: మండల కేంద్రంలో బస్సు, లారీ స్వల్పంగా ఢీకొన్న ఘటన బుధవారం జరిగింది. మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తోంది. ఈ క్రమంలో మణుగూరు వైపు వెళ్తున్న లారీ అశ్వాపురంలో స్టేట్ బ్యాంక్ ఎదుట బస్సును ఢీకొని, సైడ్ రాసుకుంటూ దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనతో సుమారు అరగంట సేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వచ్చి పునరుద్ధరించారు.
ట్రాక్టర్ ఢీకొని
యువకుడి మృతి
చర్ల: ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందిన ఘటన దానవాయిపేటలో బుధవారం రాత్రి జరిగింది. మండలంలోని బోటిగూడేనికి చెందిన తాటి మహేష్(29) దానవాయిపేట వైపు నుంచి ఆర్.కొత్తగూడెం వైపు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్.కొత్తగూడెం వైపు నుంచి దానవాయిపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మహేష్‌కు తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రుడిని స్థానికులు సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి 108 అంబులెన్సులో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
జీపీఓల విధులపై
19న సెమినార్
ఖమ్మంసహకారనగర్: గ్రామ పాలన ఆఫీసర్ల (జీపీఓ) ‘విధులు – బాధ్యతలు’అంశంపై ఈ నెల 19న ఖమ్మంలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరిక ఉపేందర్‌రావు తెలిపారు. భూభారతి చట్టంలోని అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. జీపీఓలుగా వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చిన ఉమ్మడి జిల్లాలోని వీఆర్వోలు, వీఆర్‌ఏలు హాజరుకావాలని సూచించారు.

గిన్నిస్ బుక్‌లో సంపత్‌నగర్‌వాసికి చోటు