
గ్రామాల్లోనే భూ రికార్డులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారం అనంతరం పూర్తి స్థాయి వివరాలతో కూడిన రికార్డులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో ఆదివారం కొత్తగూడెం, చుంచుపల్లి మండలాలస్థాయిలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహనా సదస్సులో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. వివాదాలకు అవకాశం లేకుండా రైతులకు సాగు భూములపై యాజమాన్య హక్కు కల్పించేలా నూతన చట్టం ఉందన్నారు. ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునే అవకాశం ఉండేదని, కానీ భూభారతిలో హక్కుల పూర్తి రికార్డు పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ వివరించారు. భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూభారతిలో ఉన్న ఫారంలో పది రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసే తహసీల్దార్ కాపీ జారీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, కొత్తగూడెం, చుంచుపల్లి తహసీల్దార్లు పుల్లయ్య, కృష్ణ, కొత్తగూడెం సొసైటీ అధ్యక్షుడు మండే వీరహనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్