కొత్త కార్ల పండగ! | 20 new cars queue for festive season 2024 | Sakshi
Sakshi News home page

కొత్త కార్ల పండగ!

Published Sat, Aug 10 2024 6:22 AM | Last Updated on Sat, Aug 10 2024 9:18 AM

20 new cars queue for festive season 2024

పండుగ సీజన్‌కు 20 కొత్త కార్ల క్యూ...  

ఇందులో 12 పూర్తిగా నయా మోడల్స్‌ 

ఎంట్రీకి పలు ఎస్‌యూవీలు రెడీ 

రేసులో టాటా కర్వ్, మహీంద్రా ఐదు డోర్ల థార్‌

సార్వత్రిక ఎన్నికలు.. మండుటెండలు.. కుండపోత వర్షాలు.. కార్ల కంపెనీల అమ్మకాలను గత మూడు నాలుగు నెలలూ గట్టిగానే దెబ్బకొట్టాయి. గ్రామీణ డిమాండ్‌తో జూలైలో మాత్రం కాస్త పుంజుకుని ఊరటనిచ్చాయి. 

నిండు కుండలా కార్ల నిల్వలు పేరుకుపోవడంతో డీలర్లు పండగ సీజన్‌ కోసం అవురావురుమని ఎదురుచూస్తున్నారు. మరోపక్క, అమ్మకాలు మందగించడంతో.. కార్ల కంపెనీలు గేరు మారుస్తున్నాయి. కొంగొత్త వాహన మోడళ్లను కారు ప్రియుల కోసం రెడీ చేస్తున్నాయి. ఆటోమొబైల్‌ సంస్థలు సేల్స్‌ పెంపుతో పండుగ చేసుకోవాలని చూస్తుండగా.. కస్టమర్లకు కూడా కొత్త కార్ల జాతర కనువిందు చేయనుంది.   

రాబోయే పండుగ సీజన్‌ కోసం కార్ల కంపెనీలన్నీ ‘కొత్త’ వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. దాదాపు 20 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అంచనా. ఇందులో 12 కార్లు పూర్తిగా కొత్తవి కావడం విశేషం. ప్రస్తుతం దేశంలో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్న స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ)పైనే కంపెనీలన్నీ ఎక్కువగా గురి పెట్టాయి.

 కొత్తగా విడుదలయ్యే వాటిలో 13 ఎస్‌యూవీ మోడల్స్‌ ఉండటం దీనికి నిదర్శనం. టాటా మోటార్స్, నిస్సాన్, సిట్రాన్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎంజీ మోటార్స్, కియా, హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్‌తో పాటు లగ్జరీ కార్‌ దిగ్గజాలు మెర్సిడెస్‌–బెంజ్, బీఎండబ్ల్యూ తదితర కంపెనీలు వచ్చే మూడు నెలల్లో కొత్త ఎస్‌యూవీలతో మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ఇక మారుతీ సుజుకీ, మెర్సిడెస్‌ నయా సెడాన్లతో అలరించనుండగా.. కియా, ఎంజీ మల్టీ పర్పస్‌ వాహనాలను (ఎంపీవీ) రంగంలోకి దించుతున్నాయి. 

సేల్స్‌ తగ్గినా.. నిల్వల పెంపు.. 
ఈ ఆరి్థక సంవత్సరం మొదలు (ఏప్రిల్‌ నుంచి) వాహన అమ్మకాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఎన్నికలతో పాటు మండుటెండలు కూడా వాహన విక్రయాలపై ప్రభావం చూపాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేయడం కంపెనీల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, గ్రా మీణ డిమాండ్‌ మళ్లీ పుంజుకోవడంతో జూలైలో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 10% పెరగ డం విశేషం. కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేయడం.. పండుగల్లో భారీ డిమాండ్‌ ఆశలతో వాహన కంపెనీలు భారీగా నిల్వలు పెంచుకున్నాయి. డీలర్ల వద్ద సగటున 25–30 రోజుల నిల్వలు ఉంటాయని, ప్రస్తుతం 60–65 రోజుల నిల్వలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.73,000 కోట్లుగా అంచనా. 

సెపె్టంబర్‌తో షురూ... 
దక్షిణాదిన కేరళ ‘ఓనమ్‌’ తో పండుగ సేల్స్‌ మొదలవుతాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి, దుర్గాపూజ, దసరా, దీపావళి ఇలా వరుసగా అటు జనాలకు ఇటు కంపెనీలకూ పండుగే. మూడు నెలలుగా పేరుకున్న నిల్వలను పండుగల్లో విక్రయించడంతో పాటు కొత్త మోడళ్లతో కస్టమర్లను షోరూమ్‌లకు క్యూ కట్టించాలనేది వాహన సంస్థల వ్యూహం. 

మహీంద్రా సక్సెస్‌ఫుల్‌ ఎస్‌యూవీ ‘థార్‌’లో (ప్రస్తుతం మూడు డోర్ల మోడల్‌ ఉంది) కొత్తగా ఐదు డోర్ల థార్‌ ‘రాక్స్‌’ను తీసుకొస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దీన్ని ఆవిష్కరించి.. పండుగ సీజన్లో మార్కెట్లోకి తీసుకొచ్చేలా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ‘ఐదు డోర్ల థార్‌ కోసం మేము ముందుగా ప్లాన్‌ చేసిన ఉత్పత్తికి మరో 3,000–4,000 అదనంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం’ అని ఎంఅండ్‌ఎం సీఈఓ (ఆటో, ట్రాక్టర్ల విభాగం) రాజేష్‌ జెజూరికర్‌ క్యూ1 ఆరి్థక ఫలితాల సందర్భంగా వెల్లడించారు.

ఈవీలు, హైబ్రిడ్‌లు కూడా... 
కొత్తగా లైన్‌ కడుతున్న వాహన మోడల్స్‌ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా రకరకాల ఇంజిన్‌ ఆప్షన్లతో లభించనున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్‌ (ఈవీ) హైబ్రిడ్‌ (సీఎన్‌జీ+పెట్రోల్‌ వంటివి) ఇంజిన్లు సైతం వీటిలో ఉన్నాయి. ఈవీ విభాగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్‌ సరికొత్త ఎస్‌యూవీ కూప్‌ ‘కర్వ్‌’తో పండగ చేసుకోవాలనుకుంటోంది. ఈ మోడల్‌లో పెట్రోల్, డీజిల్‌ వెర్షన్లతో పాటు ఈవీ వేరియంట్‌ను కూడా తీసుకొస్తోంది. ముందుగా ఈవీ ‘కర్వ్‌’ను ప్రవేశపెట్టడం విశేషం. గత నెలలో నిస్సాన్‌ ఆవిష్కరించిన ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్‌–ట్రెయిల్‌ కూడా పండుగల్లో రోడ్డెక్కనుంది.

పండుగ రేసు గుర్రాలు (అంచనా ధర రూ.లలో).. 
→ టాటా మోటార్స్‌–కర్వ్‌ ఈవీ (18–25 లక్షలు), 
→ కర్వ్‌ (రూ.10.5–20 లక్షలు),  
→ మారుతీ–స్విఫ్ట్‌ హైబ్రిడ్‌ (10 లక్షలు), డిజైర్‌–2024 (7–10 లక్షలు) 
→ మహీంద్రా–థార్‌ రాక్స్‌ (13–23 లక్షలు) 
→ నిస్సాన్‌ – ఎక్స్‌ట్రెయిల్‌ (49 లక్షల నుంచి)
→ టయోటా బెల్టా – (9.5–12 లక్షలు) 
→ మెర్సిడెజ్‌–బెంజ్‌ – ఈక్యూఎస్‌ ఎస్‌యూవీ (2 కోట్లు) 
→ బీఎండబ్ల్యూ–ఎం3 (1.47 కోట్లు) 
→ రెనో–కార్డియన్‌ (10–12 లక్షలు) 
→ ఎంజీ–క్లౌడ్‌ ఈవీ (29–30 లక్షలు), 
→ గ్లోస్టర్‌–2024 (40 లక్షలు) 
→ స్కోడా–కొడియాక్‌–2024 (40–50 లక్షలు) 
→ బీవైడీ–సీగల్‌ ఈవీ (10 లక్షలు) 
→ కియా–ఈవీ9 (75–82 లక్షలు)
→ ఆడి–క్యూ8 ఫేస్‌లిఫ్ట్‌ (రూ.1.17 కోట్లు) 
→ సిట్రాన్‌ – సీ3ఎక్స్‌ (రూ.11.5 –15 లక్షలు), బసాల్ట్‌ (రూ.8 లక్షలు)   

  – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement