2050 నాటికి ప్రపంచ జనాభా మరో 250 కోట్లు పెరుగుతుందని అంచనా. అప్పటికి అందరికీ సరిపడ ఆహారాన్ని సాధించాలంటే వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలని నిపుణులు లెక్కలు చెబుతున్నారు. అవి కాగితాలపై లెక్కలే. అసలు లెక్క వేరే ఉంది. ఆహార ఉత్పత్తులను పెంచినంత మాత్రాన అవి పేదల ఇళ్లకు చేరతాయా? చేరవు. చేరాలంటే పేదల దగ్గర అవి కొనుగోలు చేసే స్థోమత ఉండాలి. ప్రపంచంలోనే అత్యధికంగా అసమానతలు ఉన్న దేశం మనది. ఇప్పటికీ సమాజపు అట్టడుగు వర్గాల జీవితాలు అత్యంత దుర్భర ప్రాయం. వాళ్ల జీవితాలు బాగు చేయకుండా జీవన ప్రమాణాలు పెంచకుండా వ్యవసాయ ఉత్పత్తులు ఎంత పెంచితే మాత్రం ఏంటి లాభం?
పెరిగే జనాభా కలసి కట్టుగా ఆప్యాయంగా కలిసి జీవనం సాగించేలా పరిస్థితులను నెలకొల్పుకోగలమా అసలు? మన ముందున్న సవాల్ అతి పెద్ద సవాల్ ఇదే. అందరూ దృష్టి సారించాల్సింది కూడా దీనిపైనే.సంపద పంపిణీలోనే పెద్ద లోపం ఉంది. లోపం ఎక్కడుందో కనుక్కుని తక్షణమే దాన్ని సరిదిద్దుకోవల్సిన అవసరం ఉంది. మనుషుల మధ్య మానవ సంబంధాలు ఆరోగ్యకరంగా ఆప్యాయంగా ఉండాలి. (ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి?)
ఇన్ని వర్గాలూ ఒక్కతాటిపై ముందడుగు వేసి ఒక్కటిగా మనుగడ సాగించేలా చేయగలగడంపై దృష్టి సారించాలి. అది సాధ్యమా? తమ రాజకీయ ప్రయోజనాల కోసం మానవహక్కులను ఉక్కుపాదాలతో తొక్కేసి మానవ సంబంధాల మధ్య చిచ్చు రేపి మనుషుల మధ్య విద్వేషాలు రగిల్చే పరిస్థితులు పోనంత వరకు మనుషులంతా ఒక్కటే అన్న ఆలోచన రావడం చాలా కష్టం.
యంగిస్థాన్ పరిస్థితి ఏంటి?
చైనా, అమెరికాల తర్వాత భారత దేశం ఆర్ధికంగా దూసుకుపోతోందని గర్వపడుతున్నాం. ఇంగ్లాండ్, ఫ్రాన్స్,జర్మనీ వంటి యూరప్ దేశాలను దాటేసి ముందడుగు వేస్తున్నామని ఆనందిస్తున్నాం. అన్నింటినీ మించి ప్రపంచంలోనే ఏ దేశానికీ లేనంతటి యువశక్తి ఒక్క భారత్ కే ఉందని పొంగిపోతున్నాం. యంగిస్థాన్ అని మురిసిపోతున్నాం. మరి అదే యంగిస్థాన్ లో యువతకు ఎంత నాణ్యమైన విద్య అందుతోందని ఆరా తీస్తే గుండెలు గుభేలు మంటాయి. అంతర్జాతీయ స్థాయి విద్య ఎంతమందికి అందుతోంది? ఎక్కువ మంది యువత ఉండేది గ్రామాల్లో. అక్కడ సరియైన విద్యాసంస్థలే లేని పరిస్థితి ఉంది. బడ్జెట్ లో విద్యారంగంపై అరకొరగా నిధులు కేటాయిస్తోన్న నేపథ్యంలో ముందుగు ప్రభుత్వం దృష్టి సారించాల్సింది విద్యావ్యవస్థపై కాదా?
ఏదో ఒక చదువు చదివేశాంలే అనుకుంటే ఇపుడు యంగిస్థాన్‌గా ఉన్న భారత దేశమే 20 ఏళ్ల తర్వాత ఓల్డిస్థాన్ గా మారిపోతుంది. ఆ ఓల్డిస్థాన్ లోని వృద్ధులైనా తమ కాళ్లపై తాము నిలబడి సమాజానికి పనికొచ్చేది ఏమైనా చేయగలరా అంటే చెప్పడం కష్టమే అంటున్నారు మేథావులు.జనాభా పెరుగుతుంది.జనాభాతో పాటే పెరగాల్సినవి అవకాశాలు. విద్యాప్రమాణాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు. ప్రగతి పథంలో దూసుకుపోడానికి అవసరమైన సదుపాయాలు. అన్నింటినీ మించి ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు. అవి పెరగాలి. అంతే కానీ జనాభాతో పాటు కేవలం ఆహార ఉత్పత్తులు పెంచేస్తే ఒరిగేదేమీ ఉండదు. ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. దానికి తగ్గట్లు వారి ఆదాయాలు పెంచాలి. అలా చేయాలంటే వారికి ఉపాధి అవకాశాలు పెంచాలి. దానికోసం కొత్త అన్వేషణలు చేయాలి. అందుకోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలి. వాటిని నామమాత్రంగా కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలి.
ఇప్పటికీ అంటరాని తనాన్ని రూపు మాపలేని నిస్సహాయ స్థితిలో గ్రామాలు ఉన్నాయంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచమంతా జీరో హంగర్ లక్ష్యాన్ని సాధించాలని నిశ్చయించుకుంది. అయితే కోవిడ్ పాపమా అని అది సాధ్యం కాలేదు. కేవలం అందరి కడుపులు నింపడమే పరిష్కారం కాదు. అదే అభివృద్ది కాదు. ఒకపక్క పూట గడవడమే గగనమయ్యే దుర్భర పేదరికం. మరో వైపు విందులు వినోదాల పేరుతో లక్షల కోట్ల విలువ చేసే ఆహారాన్ని వృధా చేసే నిర్లక్ష్యం. ఆహార వృధాను అరికట్టినంత మాత్రాన పేదల ఆకలి తీరదు. వృధాను అరికడుతూనే పేదల కడుపుల్లో కి బువ్వ చేరే ఆలోచనలు చేయడం ముఖ్యం. ఇది చెప్పుకున్నంత తేలిక కాదు. మాట్లాడుకున్నంత ఆషామాషీ కాదు. బలమైన సంకల్పం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. కాకపోతే అది తప్ప వేరే దారీ లేదు.
గుక్కెడు పాలు అందక ఏటా కోట్లాది మంది చిన్నారులు తలలు వాల్చేస్తోన్న విషాదాలు కళ్ల ముందు కరాళ నృత్యాలు చేస్తూనే ఉన్నాయి. వాటిని చూసి అయినా మనసులో ఎక్కడో మూల చివుక్కుమనకపోవడమే దుర్మార్గం. ఒక్క భారత దేశమే కాదు యావత్ ప్రపంచం చూడాల్సింది దీన్నే పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, ఆదాయ మార్గాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అంటున్నారు మేథావులు. అన్నింటినీ మించి మనుషులంతా అన్యోన్యంగా కలసి మెలసి ఆనందంగా జీవించే వాతావరణాన్ని సృష్టించాలని వారు సూచిస్తున్నారు.
కేవలం ఆహార ఉత్పత్తులను పెంచేసి చేతులు దులుపుకుంటే దమ్మిడీ ప్రయోజనం ఉండదని వారు అంటున్నారు. భిన్న వర్గాలు,కులాలు,తెగలు ఉన్న భారత్ వంటి దేశంలో అంతా ఒక్కతాటిపైకి వచ్చి హాయిగా జీవించాలంటే అసమానతలకు చరమగీతం పాడాలని హితవు పలుకుతున్నారు. ఆ దిశగా అడుగులు పడాలని వారంటున్నారు. పెరిగిన జనానికి అనుగుణంగా వనరులను పెంచుకోవాలి. ఉన్న వనరులు ఆవిరైపోకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. కొత్త అవకాశాలు సృష్టించుకోవాలి. రేపటి తరానికి ఎదిగేందుకు అవసరమైన చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించాలి. అంతిమంగా మనుషుల మధ్క మంచి సంబంధాలు ఉండేలా మానవ హక్కులకు పెద్ద పీట వేస్తూ పాలకులు ముందుకు సాగాలి. అప్పుడే ఈ భూమే ఓ స్వర్గం అవుతుందంటున్నారు మేథావులు.
-సీఎన్‌ఎస్ యా జులు, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ
Comments
Please login to add a commentAdd a comment