న్యూఢిల్లీ/ముంబై: దేశ విమానయాన రంగం ఎయిర్‌లైన్స్ సంస్థలకు కలసిరావడం లేదు. దీనికి నిదర్శనంగా గడిచిన మూడు దశాబ్దాల కాలంలో 27 సంస్థలు కనుమరుగయ్యాయి. 1994లో మొదటిసారి దేశంలో ప్రైవేటు విమానయాన సంస్థలు (ఎయిర్‌లైన్స్ కంపెనీలు) కార్యకలాపాల నిర్వహణకు అనుమతించారు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 1996లో తొలి వికెట్ పడింది. ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ అండ్ ట్రేడ్ లింక్ 1996 నవంబర్‌లో కార్యకలాపాలను (ఆరంభించిన రెండేళ్లకు) మూసివేసింది.
అదే ఏడాది మోడిలుఫ్త్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఇలా మొత్తం మీద 27 సంస్థలు (సగటున ఏడాదికొకటి) వ్యాపార కార్యకలాపాలను మూసివేయడం, దివాలా తీయడం లేదా ఇతర సంస్థల్లో విలీనం కావడం, కొనుగోళ్లతో కనుమరుగు కావడం చోటు చేసుకుంది. కరోనా రాక ముందు 2019లోనూ జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
దివాలా పరిష్కారంలో భాగంగా ఓ కన్సార్షియం జెట్ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకున్నప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. అదే ఏడాది జెట్‌లైట్ (సహారా ఎయిర్‌లైన్స్) కూడా మూతపడింది. జూమ్ ఎయిర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించే జెక్సస్ ఎయిర్ సర్విసెస్, డెక్కన్ చార్టర్డ్ ప్రైవేటు లిమిటెడ్, ఎయిర్ ఒడిశా ఏవియేషన్ 2020లో మూసివేయగా, 2022లో హెరిటేజ్ ఏవియేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
17 ఏళ్లకు గో ఫస్ట్
2020లో కరోనా మహమ్మారి కారణంగా ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొన్ని నెలల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా పాక్షిక సర్విసులకే పరిమితమయ్యాయి. దీని కారణంగా ఎయిర్‌లైన్స్ సంస్థలకు నష్టాలు పెరిగాయి.
ఆ తర్వాత డిమాండ్ అనూహ్యంగా పుంజుకున్నప్పటికీ, గో ఫస్ట్ సంస్థకు చెందిన సగం విమానాలు ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్లలో సమస్యలతో పార్కింగ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో సగం సర్విసులనే నడుపుతూ చివరికి కార్యకలాపాలు మొదలు పెట్టిన 17 ఏళ్ల తర్వాత గో ఫస్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. జెట్ ఎయిర్‌వేస్ తర్వాత దివాలా పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీకి ముందుకు వెళ్లిన రెండో సంస్థ ఇది.
2012లో కింగ్‌ఫిషర్
ప్రముఖ సంస్థగా పేరొంది, పెద్ద ఎత్తున విమానయాన కార్యకలాపాలు నిర్వహించిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 50 విమానాలతో వందలాది సర్విసులు నిర్వహిస్తూ, ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ సంస్థ 2012లో మూతపడడంతో బ్యాంకులకు రూ.9,000 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది.
డిమాండ్‌కు తక్కువేమీ లేదు ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంటే, మరోవైపు ఒక్కో ఎయిర్‌లైన్ సంస్థ మూతపడుతుండడం సంక్లిష్టతలకు అద్దం పడుతోంది. కానీ, ఎయిర్‌లైన్స్ సేవలకు ఏటేటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2023 మొదటి మూడు నెలల్లో దేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలు 3.75 కోట్ల మంది ప్రయాణికులను చేరవేశాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 52% అధికం.
గుత్తాధిపత్యానికి బాటలు..
ప్రభుత్వరంగంలోని ఎయిర్ ఇండియాను టాటాలు గతేడాది జనవరిలో కొనుగోలు చేయడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వరం్యలో అలయన్స్ ఎయిర్ ఒక్కటే ఉంది. దీని సేవలు నామమాత్రమే. ఇక ప్రధానంగా సేవలు అందించే సంస్థలుగా ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా, ఏయిరేíÙయా, ఆకాశ ఎయిర్ ఉన్నాయి. ఇందులో ఆకాశ ఎయిర్ రాకేశ్ జున్‌జున్‌వాలా ఆరంభించినది. ఇది చాలా తక్కువ సర్విసులకే పరిమితమైంది.
ఎయిర్ ఏషియా, విస్తారా టాటాల జాయింట్ వెంచర్‌లు, వీటిని ఎయిర్ ఇండియాలో విలీనం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదే జరిగితే అప్పుడు ప్రధానంగా సేవలు అందించేవి ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ అని చెప్పుకోవచ్చు. స్పైస్‌జెట్ కూడా తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. భారీ నష్టాలతో, రుణ భారంతో నడుస్తోంది. ఒకవేళ ఇది కూడా మూతపడితే అప్పుడు ఎయిర్ ఇండియా, ఇండిగోతో దేశ ఎయిర్‌లైన్స్ మార్కెట్ మోనోపలీగా మారిపోతుందన్న ఆందోళన వినిపిస్తోంది. అంతేకాదు, సేవలపైనా దీని ప్రభావం పడుతుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment