న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ స్మార్ట్‌ఫోన్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2021 మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో వీటి వాటా 22 శాతంగా నమోదైంది. కన్సల్టెన్సీ సంస్థ సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) రూపొందించిన ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ సమీక్ష నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం మూడో త్రైమాసికంలో 20 పైగా 5జీ సామర్థ్యాలున్న స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీలు ఆవిష్కరించాయి. అందుబాటు ధర, లభ్యత తదితర అంశాలు 5జీ విక్రయాలకు దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. వన్‌ప్లస్, ఒప్పో, రియల్‌మీ, శాంసంగ్, వివో వంటి దిగ్గజ బ్రాండ్లు 5జీ స్మార్ట్‌ఫోన్లకు ప్రాధాన్యమిస్తుండటం, వినియోగదారులు కూడా భవిష్యత్ అవసరాల కోసం వీటి వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త తరం ఫోన్లకు డిమాండ్ పెరుగుతోందని సీఎంఆర్ అనలిస్ట్ శిప్రా సిన్హా తెలిపారు. ఈ అయిదు బ్రాండ్లు కలిసి 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో 3 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్లు వివరించారు.
వివో టాప్..
5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో 18 శాతం మార్కెట్ వాటాతో వివో అగ్రస్థానంలో ఉండగా, 16 శాతం వాటాతో శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. సరఫరాపరమైన సమస్యలు, విడిభాగాలు.. లాజిస్టిక్స్ వ్యయాల భారం మొదలైన సవాళ్లు నాలుగో త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉందని సీఎంఆర్ తెలిపింది. ఏడాది మొత్తం మీద చూస్తే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 5–8 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు డిజిటల్‌కు మారే క్రమంలో స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ కొనసాగుతుందని వివరించింది.
మరిన్ని ముఖ్యాంశాలు ..
సరఫరాపరమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 47 శాతం పెరిగాయి. సుమారు 5 కోట్ల పైగా అమ్ముడయ్యాయి.
షావోమీ 23 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండగా, శాంసంగ్ (18 శాతం), వివో (15 శాతం), రియల్‌మి (15 శాతం), ఒప్పో (9 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
వన్‌ప్లస్ విక్రయాలు 68 శాతం, యాపిల్ అమ్మకాలు 32 శాతం పెరిగాయి. సూపర్ ప్రీమియం (రూ. 50,000–1,00,000) సెగ్మెంట్‌లో యాపిల్ 84 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ట్రాన్సిషన్ గ్రూప్ బ్రాండ్ల (ఐటెల్, ఇన్ఫినిక్స్, టెక్నో) మొత్తం అమ్మకాలు 18 శాతం, స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 36 శాతం పెరిగాయి.
ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ విక్రయాలు 21 శాతం క్షీణించి 2.4 కోట్లకు పరిమితమయ్యాయి.
చదవండి: అదిరిపోయే ఫీచర్స్, 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇంత తక్కువ..!
Comments
Please login to add a commentAdd a comment