![5G Tariff Charges Will Be Hike For Upcoming Days - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/14/5g01.jpg.webp?itok=ZZRTnAl5)
ఖర్చులను తట్టుకోవడానికి టెలికం రంగ సంస్థలు టారిఫ్‌లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్లిమిటెడ్ 5జీ డేటా ప్లాన్‌లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు 2024 జూన్ నుంచి 4జీతో పోలిస్తే 5జీ సేవలకు కనీసం 5-10శాతం ఎక్కువ ఛార్జీ విధించవచ్చని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు.
టెలికం కంపెనీలు 5జీ సేవల కోసం భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ క్వార్టర్లో రెండు టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. కస్టమర్లను 5జీకి అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు 5జీ అన్లిమిటెడ్ డేటా ఆఫర్లతో పాటు 4జీ ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీకి అలవాటు పడటం మొదలైనందున కంపెనీలు మానిటైజేషన్‌పై దృష్టిసారించినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ రెండు సంస్థలు కొన్ని నెలల్లో 5జీ- కోసం ప్లాన్‌లను ప్రకటించవచ్చని జెఫ్రీస్ ఒక రీసెర్చ్ నోట్‌లో తెలిపింది. ఎయిర్‌టెల్, జియో 5జీ రేట్లు 4జీ కంటే 5-10శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి ప్లాన్లకు 30-40శాతం అదనపు డేటాను జోడించి మార్కెట్ షేరును పెంచుకొని, లాభాలు పొందవచ్చని తెలిసింది.
ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..
తగిన సమయంలో ఛార్జీలు పెంచడానికి వెనకాడబోమని గతంలో ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి దాదాపు రూ.250కి పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్‌టెల్‌కు కలిపి ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. దేశం మొత్తం 5జీ యూజర్ బేస్ 2024 చివరి నాటికి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment