ముంబై: చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మే 19వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 బ్యాంక్ నోట్లు చెలామణిలో ఉన్నాయి. అక్టోబర్ 31వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి ఈ విలువ రూ.10,000 కోట్లకు తగ్గింది’’ అని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ప్రాంతీయ కార్యాలయాల్లో బారులు..
దేశంలోని 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రాష్ట్ర రాజధానుల్లో ఆర్‌బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎవరైనా ఈ కార్యాలయాలకు వెళ్లలేని పక్షంలో పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని ఆర్‌బీఐ సూచించింది. కాగా, రూ.2,000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ కోసం ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద పని వేళల్లో పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి.
రెండువేల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలను 19 ఆర్‌బీఐ కార్యాలయాలకు మారాయి. ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. డిపాజిట్‌కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment