భారత్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా లండన్‌లో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.1,446 కోట్లు వెచ్చించి ఆ భవనాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఒప్పందం ఖరారైనట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్‌లో విస్తృతంగా పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన విషయం తెలిసిందే.
కొన్ని మీడియా కథనాల ప్రకారం.. లండన్‌లోని హైడ్ పార్క్ ప్రాంతంలో ఉన్న అబెర్‌కాన్వే హౌస్‌ను పూనావాలా కొనుగోలు చేశారు. ఈ భవనం 1920 నాటిది. దీని విస్తీర్ణం 25 వేల చదరపు అడుగులు. పోలండ్‌కు చెందిన దివంగత వ్యాపారవేత్త జాన్ కుల్‌జిక్ కుమార్తె డొమినికా కుల్‌జిక్ నుంచి అదర్ పూనావాలా దీన్ని కొనుగోలు చేసినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన యూకే అనుబంధ సంస్థ సీరం లైఫ్ సైన్సెస్ ఈ భవనాన్ని సొంతం చేసుకోనున్నట్లు సమాచారం.
లండన్‌లో ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఇంటి కొనుగోలుగా ఇది నిలవనున్నట్లు సమాచారం. లండన్‌లో ఇది రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా రికార్డుల్లో ఉండనుందని పలువురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తెలిపారు. అయితే తాజా కొనుగోలుతో పూనావాలా కుటుంబం లండన్‌కు మకాం మార్చే అవకాశాలేమీ లేవని సీరం లైఫ్ సైన్సెస్‌కు చెందిన ఓ కీలక పదవిలోని వ్యక్తి తెలిపారు. ప్రస్తుతానికి కంపెనీ కార్యకలాపాలకు ఇది కేంద్రంగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు ఈ భవనాన్ని గెస్ట్‌హౌజ్‌గా వినియోగించుకోనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’
లండన్‌లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భవనంగా 2-8ఏ రట్లాండ్ గేట్ నిలిచింది. సౌదీ మాజీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులాఅజిజ్‌కు చెందిన ఎస్టేట్ దీన్ని 2020 జనవరిలో 210 మిలియన్ పౌండ్లు(రూ.2100 కోట్లు)కు కొనుగోలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దీని వాస్తవ కొనుగోలుదారుడు చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ వ్యవస్థాపకుడు ‘హుయ్ కా యాన్’గా గుర్తించినట్లు గత ఏడాది ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది పునావాలా కొనుగోలు చేసిన భవనం కాకుండా రెండో ఖరీదైన భవనం కొనుగోలుగా హనోవర్‌లాడ్జ్ (రూ.1180 కోట్లు) నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment