టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతోంది. వేలాదిగా ఉద్యోగులను వదిలించుకుంటున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల బాటలో ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపుల వేదిక ‘పేపాల్’ పయనిస్తోంది. మందగించిన ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపుతూ దాదాపు 2వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
2వేల మందిని లేదా మొత్తం ఉద్యోగుల్లో 7 శాతం మందిని తొలగించనున్నట్లు కంపెనీ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. స్థూల ఆర్థిక పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ డ్యాన్ షుల్మన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యయాన్ని తగ్గించుకుని ప్రధాన లక్ష్యాల సాధనపై మరింత దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.
పేపాల్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 429 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఎక్కువ మంది యూక్టివ్ యూజర్లు గల కంపెనీల జాబితాలో 5వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో పేపాల్ సంస్థ గత నవంబర్‌లో తమ కంపెనీ రెవెన్యూ వృద్ధి అంచనాను తగ్గించుకుంది.
కొనసాగుతున్న లేఆఫ్స్ పరంపర
12వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ గత నెలలోనే ప్రకటించింది. అదే బాటలో మైక్రోసాఫ్ట్ 10వేల మందిని, సేల్స్ ఫోర్స్ 7వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయ మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ స్పోటిఫై దాదాపు 10వేల మందిని తొలగిస్తున్నట్లు గత వారమే వెల్లడించింది.
చదవండి: బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..?
Comments
Please login to add a commentAdd a comment