ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. మానవ ఉద్యోగాలను హరించేస్తోంది. రానున్న రోజుల్లో సాధారణ ఉద్యోగాలు పొందడం చాలా కష్టతరం చేయబోతోంది. ముఖ్యంగా ఏఐ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే పరిశ్రమలలో పనిచేసేవారికి ముప్పు తప్పదని కెరీర్ నిపుణులు చెబుతున్నారు.
బిజినెస్ ఇన్‌సైడర్ కథనం ప్రకారం.. ఏఐ ఆగమనం కస్టమర్ సర్వీస్ రెప్స్, క్యాషియర్‌లు, ఆఫీస్ అసిస్టెంట్లు, ప్రొడక్షన్ వర్కర్లకు పెద్ద హెచ్చరిక. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన లేబర్ మార్కెట్, డిజిటల్ టెక్ పరిశోధకుడు జార్జియోస్ పెట్రోపౌలోస్ ప్రకారం, "మీడియం-స్కిల్డ్" కార్మికులు సాంకేతికత ద్వారా స్థానభ్రంశం చెందే అవకాశం ఉంది.
అధిక-నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా తమ ప్రస్తుత ఉద్యోగాల్లోకి ఏఐని జోడించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్‌ల వంటివారి సేవలకు మాత్రం నిరంతర డిమాండ్ ఉంటుంది. ప్రధాన స్రవంతిలోకి ఏఐ మరింతగా చొచ్చుకుని రావడం వల్ల రానున్న దశాబ్దాల్లో మీడియం-స్కిల్డ్ కార్మికుల్లో అధిక నిరుద్యోగం ఏర్పడుతుందని పెట్రోపౌలోస్ అంచనా వేస్తున్నారు. 20 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఏఐతో నడిచే జాబ్ మార్కెట్‌కి మారుతుంది అంటున్నారాయన.
యూఎస్ జాబ్ మార్కెట్‌లో ఏఐ ప్రభావం కారణంగా తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు డిమాండ్ కోల్పోతారని అంచనా వేస్తున్నారు మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ క్వెలిన్ ఎల్లింగ్‌రూడ్. ఈయన ప్రకారం.. 2030 నాటికి 1.2 కోట్ల మంది ఉద్యోగులు వేరే కెరీర్‌లను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ దశాబ్దం చివరి నాటికి 6,30,000 క్యాషియర్‌లు, 7,10,000 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌లు, 8,30,000 మంది సేల్స్ ఉద్యోగులు ఉపాధిని కోల్పోతారని మెకిన్సే అంచనా వేసింది. అన్ని పరిశ్రమల్లోని క్లర్క్‌ల సంఖ్య 1.6 కోట్లు తగ్గుతుందని ఈ సంస్థ గత ఏడాది ఒక నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment