ముంబై, సాక్షి: దేశీ మార్కెట్లో యూరోపియన్ తయారీ ప్రీమియం సైకిళ్లను ప్రవేశపెట్టనున్నట్లు స్టార్టప్ అల్ఫావెక్టర్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా యూరోపియన్ దిగ్గజం కేటీఎంతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తద్వారా దేశీయంగా ఖరీదైన యూరోపియన్ సైకిళ్లను అందించనున్నట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా వీటికి ప్రత్యేక పంపిణీదారుగా నిలవనున్నట్లు వివరించింది. కేటీఎం తయారీ ప్రీమియం సైకిళ్లు రూ. 30,000 ప్రారంభ ధర నుంచి లభించనున్నట్లు తెలియజేసింది. దేశీ మార్కెట్లో రూ. 10 లక్షల వరకూ గరిష్ట విలువగల పలు మోడళ్ల సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. చదవండి: (హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!)
మెరాకీసహా..
అల్ఫావెక్టర్ ఇటీవల మెరాకీ పేరుతో ఈబైసికిల్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. కంపెనీ ఇప్పటికే చౌక- ప్రీమియం విభాగాల్లో మౌంటెయిన్, ఆల్‌టెరైన్, హైబ్రిడ్, ఫ్యాట్ టైర్ బైకులను ప్రవేశపెట్టింది. దేశీయంగా సైక్లింగ్‌కు ఆదరణ పెరుగుతున్నట్లు ఈ సందర్భంగా అల్ఫావెక్టర్ సీఈవో సచిన్ చోప్రా పేర్కొన్నారు. ప్రధానంగా ప్రీమియం విభాగంలో అధిక వృద్ధికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాలలో ప్రజలు సైక్లింగ్ తదితర ఆరోగ్యకర జీవన విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ప్రీమియం సైక్లింగ్ విభాగంలో భారీ అవకాశాలున్నట్లు అంచనా వేశారు. భారత్ మార్కెట్లో కేటీఎం బైసికిల్స్‌ను ప్రవేశపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.
2015లో..
డిమాండుకు అనుగుణంగా అత్యంత నాణ్యమైన, పటిష్ట పనితీరును చూపగల సైకిళ్లను అందించనున్నట్లు చోప్రా తెలియజేశారు. మిలీనియల్స్, జెన్-జెడ్ విభాగాలపై ప్రత్యేక దృష్టితో సైకిళ్లను అందించనున్నట్లు వివరించారు. ఐదు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన కంపెనీగా గరిష్ట ప్రమాణాలతో సైకిళ్లను తయారు చేస్తున్నట్లు అల్ఫావెక్టర్‌తో ఒప్పందం సందర్భంగా కేటీఎం బైక్ ఇండస్ట్రీస్ ఎండీలు జోహనా ఉర్కాఫ్, స్టెఫాన్ లింబ్‌రన్నర్ పేర్కొన్నారు. తమ సైకిళ్లకు ప్రధానంగా మెట్రో నగరాల నుంచి అధిక డిమాండ్ కనిపించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. 2015లో ప్రారంభమైన అల్ఫావెక్టర్‌లో ఇప్పటికే ఫైర్‌సైడ్ వెంచర్స్, అవానా క్యాపిటల్, టైటన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment