
వాషింగ్టన్: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆరోగ్య సేవల రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వన్ మెడికల్ సంస్థను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. షేరు ఒక్కింటికి 18 డాలర్ల చొప్పున మొత్తం 3.9 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు వివరించింది.
మెంబర్‌షిప్ ప్రాతిపదికన వన్ మెడికల్ తమ సభ్యులకు వైద్యుల కన్సల్టింగ్, ఫార్మసీ సర్వీసులు అందిస్తోంది. మార్చి ఆఖరు నాటికి 25 మార్కెట్లలో కంపెనీకి 7,67,000 మంది సభ్యులు, 188 మెడికల్ ఆఫీసులు ఉన్నాయి. 254 మిలియన్ డాలర్ల ఆదాయంపై 91 మిలియన్ డాలర్ల నష్టం నమోదు చేసింది. అమెజాన్ గతేడాది నుంచే అమెజాన్ కేర్ పేరిట టెలీమెడిసిన్ సర్వీసులను కంపెనీలకు అందించడం ప్రారంభించింది. 2020లో ఆన్‌లైన్ ఔషధాల స్టోర్‌ను ఏర్పాటు చేసింది.
అమెజాన్ గతంలో 13.7 బిలియన్ డాలర్లతో హోల్ ఫుడ్స్‌ను, 8.5 బిలియన్ డాలర్లతో హాలీవుడ్ స్టూడియో ఎంజీఎంను కొనుగోలు చేసింది. అమెజాన్ కొనుగోలు చేస్తోందన్న వార్తలతో వన్ మెడికల్ మాతృ సంస్థ 1లైఫ్ హెల్త్‌కేర్ షేర్లు 68 శాతం ఎగిసి 17.13 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment