ముంబై: గ్రోసరీ వ్యాపారంలో మరింతగా విస్తరించే ప్రణాళికలతో అమెజాన్ ఇండియా ఉంది. నాన్ మెట్రో, ఇతర పట్టణాల్లోని మొదటి సారి కస్టమర్లను పెద్ద ఎత్తున సొంతం చేసుకోవాలనుకుంటోంది. గడిచిన ఏడాది కాలంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు ఇతర పట్టణాల నుంచి అమెజాన్‌లో షాపింగ్ చేసిన కొత్త కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త కస్టమర్లలో 85 శాతం.. అలాగే, ఆర్డర్లలో 65 శాతం ద్వితీయ శ్రేణి, అంతకంటే చిన్న పట్టణాల నుంచే ఉన్నాయి. అమెజాన్ గ్రోసరీ వ్యాపారమైన అమెజాన్ ప్యాంట్రీలనూ కొనుగోలు చేసే మొత్తం కస్టమర్ల సంఖ్య పెరిగింది. అమెజాన్ ప్యాంట్రీలో కొనుగోలుదారులు రెట్టింపుయ్యారు. కరోనా తర్వాత అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ ఫ్రెష్‌పై ఆర్డర్లలో 60 శాతానికి పైగా నూతన కస్టమర్ల నుంచే, అది కూడా నాన్ మెట్రోల నుంచే ఉంటున్నాయి.
వేగంగా డెలివరీ..
ఆర్డర్ చేసిన వెంటనే వేగంగా గ్రోసరీ డెలివరీని అందించే లక్ష్యంతో అమెజాన్.. 10 పట్టణాల్లో ప్యాంట్రీ (డ్రై గ్రోసరీ/కిరాణా సరుకులు), ఫ్రెష్ (కిరాణా, పండ్లు, కూరగాయలు) సేవలను ఏకీకృతం చేసింది. మరింత వేగంగా డెలివరీ చేసేందుకు సమగ్ర ఆన్‌లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఆర్డర్లను ఇక్కడి నుంచే వేగంగా డెలివరీ చేయనుంది. ఇక మిగిలిన 290 పట్టణాల్లో ఫ్రెష్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్యాంట్రీ ద్వారా ఆయా పట్టణాల్లో గ్రోసరీ ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది.
‘‘గ్రోసరీ విభాగం రెండు రెట్లు పెరిగి అమెజాన్ డాట్ ఇన్‌లో నూతన కస్టమర్లకు ఒక గేట్‌వేగా మారింది. ఆన్‌లైన్ గ్రోసరీ విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయి. ఇది ఇప్పటికీ చాలా చిన్న మార్కెట్‌గానే ఉంది. భారత్‌లో ప్రజల గ్రోసరీ కొనుగోళ్ల తీరు పూర్తిగా పరిణామం చెందనుంది. రానున్న కొన్నేళ్లలో ఈ విభాగం ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. కొత్తగా వచ్చే కస్టమర్లలో ఎక్కువ శాతం చిన్న పట్టణాలు, గ్రామాల నుంచే ఉంటారని అంచనా వేస్తున్నాము. డ్రై గ్రోసరీ పరిధిని విస్తరించనున్నాము. టాప్-50 పట్టణాల్లో ఫ్రెష్, డ్రై గ్రోసరీలో పూర్తి శ్రేణిలో ఉత్పత్తులను అందించనున్నాము’’ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ తెలిపారు.
టాటాలు సైతం..
టాటా గ్రూపు సైతం ఆన్‌లైన్ గ్రోసరీ వ్యాపారంపై భారీ అంచనాలతోనే ఉంది. టాటా డిజిటల్ లిమిటెడ్ ఇప్పటికే బిగ్ బాస్కెట్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని, కాంపిటిషన్ కమిషన్ ఆమోదం కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. రిలయన్స్ జియో సైతం జియోమార్ట్ పేరుతో పట్టణాల్లో గ్రోసరీ డెలివరీ చేస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ కూడా విస్తరణ ప్రణాళికలతో ఉంది. ఈ ఏడాది ఈ విభాగంలో మంచి వృద్ధి నమోదవుతుందన్న అంచనాలతో ఉన్నాయి. గతేడాది లాక్‌డౌన్‌లు విధించడం ఆన్‌లైన్ గ్రోసరీ మార్కెట్ విస్తరణకు మద్దతునిచ్చిన అంశంగా చెప్పుకోవాలి.
2019లో 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆన్‌లైన్ గ్రోసరీ వ్యాపారం 2020లో 3.3 బిలియన్ డాలర్లకు విస్తరించినట్టు రెడ్‌సీర్ సంస్థ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2025 నాటికి ఈ మార్కెట్ 24 బిలియన్ డాలర్లకు (రూ.1.75లక్షల కోట్లు) విస్తరిస్తుందని అంచనా వేస్తోంది. స్థానిక కిరాణా వర్తకుల భాగస్వామ్యంతో కూడిన అమెజాన్ ‘లోకల్ షాప్స్’ ఈ ఏడాది మార్చి నాటికి 450 పట్టణాల్లో 50,000 ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలకు విస్తరించగా.. ఈ ఏడాది చివరికి రెట్టింపు సంఖ్యకు చేరుకుంటామని అమెజాన్ ఇండియా అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా అమెజాన్ ఈ కామర్స్ వేదికగా స్థానిక కిరాణా వర్తకులు రిజిస్టర్ చేసుకుని విక్రయాలు చేపట్టవచ్చు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment