తెలుగురాష్ట్రాలకు చెందిన పెన్నా సిమెంట్‌కు ఉన్న రూ.3,000 కోట్ల అప్పును తామే తీరుస్తామని అదానీ గ్రూపు ఆధ్వర్యంలోని అంబుజా సిమెంట్స్ తెలిపింది. ఇటీవల పెన్నా సిమెంట్‌ను రూ.10,422 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు అంబుజా ప్రకటించింది. దాంతో కంపెనీ ఇతర సంస్థలకు బకాయిపడిన రుణాలను సైతం తీరుస్తామని అంబుజా సిమెంట్స్ హామీ ఇచ్చింది.
పెన్నా సిమెంట్స్‌లోని 100 శాతం వాటాను అదానీ గ్రూప్‌లో భాగంగా ఉన్న అంబుజా సిమెంట్స్ రూ.10,422 కోట్లుకు కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మరో 3-4 నెలల్లో ఈ డీల్ పూర్తవుతుందని, ఆ తర్వాత పెన్నాకు ఉన్న రుణాన్ని చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంబుజా వద్ద ఇప్పటికే రూ.15,676 కోట్ల మిగులు నిల్వలున్నాయి. పెన్నా అప్పులను ఈ మిగులు నుంచి చెల్లించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెన్నా రుణంపై వడ్డీ వ్యయాలను తగ్గించడంతో పాటు, క్రెడిట్ రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘ఏఏఏ’గా మార్చేందుకు ఇది సహాయపడుతుందని అంబుజా అంచనావేస్తుంది.
సిమెంట్‌తో పాటు క్లింకర్, గ్రైండింగ్, ప్యాకేజింగ్, విద్యుత్ రంగాల్లో అదానీ గ్రూప్ విస్తరించింది. ప్రస్తుతం పెన్నా సిమెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లో ఉన్న అయిదు సిమెంట్ యూనిట్లతో కలిపి ఏడాదికి 14 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెన్నా సిమెంట్ కొనుగోలుతో అదానీ గ్రూపు దేశవ్యాప్త సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరింది.
ఇదీ చదవండి: టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!
ఈ ఒప్పందం ద్వారా దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం రెండు శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందని, ఇదే సమయంలో శ్రీలంకలో పెన్నా సిమెంట్‌కు ఉన్న స్థానిక అనుబంధ కంపెనీ ద్వారా ఆ దేశంలో కూడా అడుగు పెట్టే అవకాశం కలుగుతుందని అదానీ గ్రూపు ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment