న్యూఢిల్లీ: హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియాపై అదానీ గ్రూప్ కన్నేసింది. జర్మన్ దిగ్గజం హైడెల్‌బర్గ్ మెటీరియల్స్ దేశీ అనుబంధ సంస్థ హైడెల్‌బర్గ్ సిమెంట్ కొనుగోలుకు అదానీ గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో 18 శాతం దూసుకెళ్లింది. రూ.258 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.227 వద్ద ముగిసింది.
చర్చలు సఫలమైతే హైడెల్‌బర్గ్ ఇండియాను బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ దిగ్గజం అంబుజా సిమెంట్స్ సొంతం చేసుకునే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్లు) విలువలో డీల్ కుదరవచ్చని అంచనా వేశాయి. అయితే అంబుజా సిమెంట్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.3 శాతం క్షీణించి రూ.591 వద్ద ముగిసింది.
ఇదీ చదవండి: పేరుకుపోతున్న వాహన నిల్వలు
2006లోనే భారత్‌లోకి..
హైడెల్‌బర్గ్ సిమెంట్ ఏజీ 2006లో భారత్‌లోకి ప్రవేశించింది. మైసూర్ సిమెంట్, కొచ్చిన్ సిమెంట్, ఇండోరమా సిమెంట్‌తో ఏర్పాటైన జాయింట్ వెంటర్‌లను కొనుగోలు చేయడం ద్వారా కార్యకలాపాలు ప్రారంభించింది. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ, విస్తరణల తర్వాత 5.5 మిలియన్ టన్నులకు స్థాపిత సిమెంట్ సామర్థ్యాన్ని చేర్చుకుంది. 2016లో ఐటల్ సిమెంట్ కొనుగోలుతో కార్యకలాపాలు రెట్టింపునకు పెంచుకుంది. ప్రస్తుతం నాలుగు సమీకృత సిమెంట్ తయారీ, గ్రైండింగ్ యూనిట్లను కలిగి ఉంది. దాంతో స్థాపిత సామర్థ్యం 14 మిలియన్ టన్నులకు ఎగసింది. మైసెమ్, జువారీ బ్రాండ్లతో 12 రాష్ట్రాల్లో విస్తరించింది. అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత చాలా కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే హైడెల్‌బర్గ్ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నారనేలా వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment