13 ఏళ్ల అమ్మాయికి 'ఆనంద్ మహీంద్రా' జాబ్ ఆఫర్: ఎందుకో తెలిస్తే.. | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల అమ్మాయికి 'ఆనంద్ మహీంద్రా' జాబ్ ఆఫర్: ఎందుకో తెలిస్తే..

Published Sat, Apr 6 2024 9:43 PM

Anand Mahindra Job Offer To 13 Years Girl Here Is The Reason - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో 13 ఏళ్ల 'నిఖిత' కోతుల దాడి నుంచి తనతోపాటు ఉన్న చిన్నపిల్లను కాపాడిన తీరు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' కూడా ఫిదా అయ్యారు. ఏకంగా జాబ్ ఆఫర్ కూడా చేశారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో  తెలుసుకుందాం.

నిఖిత అమెజాన్ అలెక్సాను ఉపయోగించి ఇంట్లోకి చొరబడ్డ కోతులను భయపెట్టి తరిమేసింది. కోతులు వచ్చినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో అలోచించి దైర్యంగా ఎదుర్కొన్న ఆ అమ్మాయిని పలువురు ప్రశంసిస్తున్నారు. దీనికి ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక ట్వీట్ చేశారు.

టెక్నాలజీకి మనం బానిసలుగా మారుతామా? లేదా ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మాస్టర్స్ అవుతామా? అనేది ప్రశ్న. 13 ఏళ్ల అమ్మాయి వేగంగా ఆలోచించి అమెజాన్ అలెక్సాను ఉపయోగించి కోతుల భారీ నుంచి బయటపడింది. ఆమె ప్రదర్శించిన స్ఫూర్తి చాలా గొప్ప విషయం. నిఖిత చదువు పూర్తయిన తరువాత ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే.. ఆమెను మాతో చేరటానికి ఒప్పించగలమని ఆశిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: ఫీజుకు డబ్బుల్లేక భార్య నగలమ్మిన అనిల్‌ అంబానీ.. ఎంతటి దుస్థితి!

అసలేం జరిగిందంటే?
కొంత మంది అతిథులు నిఖిత ఇంటికి వచ్చారని, ఆ సమయంలో గేట్ ఓపెన్ చేసి ఉంచడం వల్ల కోతులు వంటగదిలో ప్రవేశించాయని నిఖిత చెప్పింది. కోతులు వంటగదిలో ప్రవేశించిన తరువాత అక్కడున్న వస్తువులను విసిరివేయడం స్టార్ట్ చేశాయి. ఆ సమయంలో అక్కడనే ఉన్న చిన్నపిల్ల భయపడింది. కానీ నేను మాత్రమే అలెక్సాను కుక్కలాగా శబ్దం చేయమని ఆదేశించాను.. అలెక్స్ చెప్పినట్లు చేసింది. దీంతో కోతులు భయపడి అక్కడ నుంచి పారిపోయాయని చెప్పింది.

Advertisement
Advertisement