భారతదేశంలో యాపిల్ ఐఫోన్ల తయారీ చాలా వేగంగా సాగుతోంది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇండియా నుంచి సుమారు 6 బిలియన్ డాలర్ల (రూ. 50వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 85వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని అంచనా.
అమ్మకాల పరంగా యాపిల్ గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయమైన వృద్ధి సాధించవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఉద్యోగులను ఉపయోగించుకుని.. కంపెనీ దేశంలో తన పరిధిని భారీగా విస్తరించడానికి సిద్ధమవుతోంది. అమెరికా.. చైనా దిగుమతులను తగ్గించుకోవడంతో ఐఫోన్ దిగుమతులు భారత్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా అవతరిస్తుంది.
యాపిల్‌కు ప్రధాన సరఫరాదారులుగా ఉన్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్పొరేషన్ రెండూ కూడా టాటా ఎలక్ట్రానిక్స్‌తో చేతులు కలిపాయి. స్వదేశీ కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ దక్షిణ భారతదేశంలో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తోంది. చెన్నై శివార్లలోని ఫాక్స్‌కాన్ యూనిట్ భారతదేశంలో అగ్ర సరఫరాదారుగా ఉంది. దేశంలో జరుగుతున్న మొత్తం ఐఫోన్ ఎగుమతుల్లో ఇది దాదాపు సగం వాటాను కలిగి ఉంది.
గత సంవత్సరం యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'టిమ్ కుక్' ముంబై, న్యూఢిల్లీలోని ఆపిల్ స్టోర్స్ ప్రారంభించారు. దీంతో మన దేశంలో కూడా యాపిల్ విక్రయాలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో యాపిల్ మరింత గొప్ప అమ్మకాలు పొందే అవకాశం ఉంది. 2030 నాటికి భారతదేశ యాపిల్ విక్రయాలు 33 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2.7 లక్షల కోట్లు) చేరుకోవచ్చని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ కూడా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment