పెట్రోలు ధరల నుంచి ఉపశమనం మాట ఏమోగాని డబ్బులచ్చి మరీ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టుగా ఉంది ఎలక్ట్రిక్ బైకుల పరిస్థితి. తయారీలో నాణ్యతా లోపాలు, కంపెనీల పట్టింపులేని తనం, యూజర్ గైడ్‌పై అవగాహన కల్పించకపోవడం వల్ల వేసవి మొదలైనప్పటి నుంచి దేశంలో రోజుకో చోట ఎలక్ట్రిక్ బైకులు గ్రనేడ్లలా పేలిపోతూ అగ్ని ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి.
రీకాల్ తప్పదా
ఎలక్ట్రిక్ బైకుల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌ల కంటే మేలో మరిన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రమాదాలతో సంబంధం ఉన్న కంపెనీలే కాకుండా మార్కెట్‌లో ఉన్న ఈవీ మేకర్స్ అందరూ మరోసారి తమ వాహనాలను రీకాల్ చేసి నాణ్యతా పరీక్షలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో అగ్ని ప్రమాదాలకు నిపుణులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి.
ఉష్ణోగ్రతలు కారణమా?
- సాధారణంగా లిథియం ఐయాన్ బ్యాటరీలు మైనస్ 20 సెల్సియస్ డిగ్రీల నుంచి ప్లస్ 50 సెల్సియస్ డిగ్రీల వరకు తట్టుకోగలవు. యాభై సెల్సియస్ డిగ్రీల కంటే ఉష్ణోగ్రత పెరిగిపోతే లిథియం ఐయాన్ బ్యాటరీలు తట్టుకోలేవు.
- మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉపయోగిస్తున్న లిథియం ఐయాన్ బ్యాటరీలను చైనా, దక్షిణ కొరియాల నుంచి దిగుమతి చేసుకున్నవి ఎక్కువగా ఉంటున్నాయి. ఈ బ్యాటరీలు అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా తయారు చేస్తున్నారు.
- కానీ మనదేశంలో వేసవిలో అనేక ప్రాంతాల్లో బయటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 సెల్సియస్ డిగ్రీలకు చేరుకుంటుంది. బయటి ఉష్ణోగ్రత ఈ స్థాయిలో ఉన్నప్పుడు బ్యాటరీల ఉష్ణోగ్రతలు 50 నుంచి 55 సెల్సియస్ డిగ్రీల దగ్గర నమోదు అవుతుంటాయి. ముఖ్యంగా ఛార్జింగ్‌లో పెట్టినప్పుడు, ఎండలో వాహనం ఎక్కువ సేపు నిలిపినప్పుడు ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఎక్కువ.
- బ్యాటరీ ఉష్ణోగ్రత 50 సెల్సియస్ డిగ్రీలు దాటి ఎక్కువ సేపు కొనసాగితే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఫలితంగా ఒక్కసారిగా బ్యాటరీలు బాంబుల్లా పేలిపోతాయి.
మేనేజ్‌మెంట్ ఫెయిల్యూర్ ?
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) అనేది ఎంతో కీలకమైన అంశం. బ్యాటరీ ప్యాక్‌లో ఉన్న ప్రతీ సెల్ టెంపరేచర్‌ను మానిటర్ చేసే స్మార్ట్ బీఎంఎస్ వ్యవస్థను వాహన తయారీ సంస్థలు సమకూర్చుకోవాల్సి ఉంది. బ్యాటరీ టెంపరేచర్ ఆపరేట్ చేసేందుకు ప్రత్యేక కూలింగ్ సిస్టమ్‌ని అమర్చుకోవాల్సి ఉంది. అయితే ఇవి ఖరీదైన వ్యవహారాలు కావడంతో చాలా సంస్థలు ఈ బీఎంఎస్ టెక్నాలజీపై దృష్టి సారించడం లేదు. తక్కువ ధరకే వాహనం అందించాలనే పోటీతో నాణ్యత విషయంలో రాజీ పడుతున్నారయనే ఆరోపణలు వస్తున్నాయి.
దృష్టి పెట్టాల్సిందే
గత రెండేళ్లుగా మార్కెట్‌లో ఈవీ బూమ్ కొనసాగుతోంది. అయితే గత రెండు వేసవిల్లో లాక్‌డౌన్ నిబంధనలు, ప్రయాణ ఆంక్షలు ఉండటం వల్ల ఈవీలు రోడ్లపైకి వచ్చింది తక్కువ. ఈసారి ఆంక్షలు లేకపోవడంతో ఈవీలు రోడ్లపై రయ్‌రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. ఇదే సమయంలో అందులోని లోపాల కారణంగా ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్, ప్రమాదాలు ఎదురవుతున్నాయి. భవిష్యత్తు ఆశకిరణంగా చెప్పుకుంటున్న ఈవీలపై భయాలు తొలగిపోయి నమ్మకం కలగాలంటే మరింతగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వర్క్ జరగాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment