
న్యూఢిల్లీ: దేశీయంగా సొంత 5జీ టెలికం సాంకేతికత ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నాటికల్లా అందుబాటులోకి రాగలదని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయం తెలిపారు. నాణ్యమైన సాంకేతికతను చౌకగా పొందేందుకు ఇతర దేశాలు కూడా ఈ టెక్నాలజీలను పరిశీలించాలని కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు సూచించారు. మరోవైపు, ఆర్థిక వృద్ధిలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో డిజిటల్ తారతమ్యాలను తొలగించడం మరింత కీలకంగా మారిందని వైష్ణవ్ తెలిపారు. సమ్మిళిత వృద్ధి కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ఆయన వివరించారు. మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వైష్ణవ్ చెప్పారు.
నిబంధనలు పాటించకుంటే.. వెళ్లిపోవచ్చు..
కొత్త మార్గదర్శకాలను పాటించేందుకు సిద్ధంగా లేని వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) సర్వీస్ ప్రొవైడర్లకు దేశం నుంచి నిష్క్రమించడం ఒక్కటే మార్గమని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సైబర్ నేరాల రిపోర్టింగ్ కొత్త నిబంధనలపై సందేహాల నివృత్తికి రూపొందించిన ఎఫ్‌ఏక్యూలను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు.
5జీతో భారీగా ఉపాధికి ఊతం: టెలికం శాఖ కార్యదర్శి
5జీ టెక్నాలజీ, కొత్త సర్వీసులతో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు రాగలవని టెలికం శాఖ కార్యదర్శి కె. రాజారామన్ తెలిపారు. కొత్త టెక్నాలజీల్లో శిక్షితులైన వారి అవసరం గణనీయంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. టెలికం పరిశ్రమ నైపుణ్యాల మండలి (టీఎస్‌ఎస్‌సీ) కార్యక్రమంలో పాల్గొ న్న సందర్భంగా రాజారామన్ ఈ విషయాలు వివరించారు. భారత్‌నెట్ నుంచి స్పేస్ కమ్యూనికేషన్స్ వరకూ, 5జీ నుంచి ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల దాకా టెలికంలో.. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైన విభాగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు రాగలవన్నారు.
చదవండి: షెడ్యూల్ ప్రకారమే 5జీ ప్రక్రియ..
Comments
Please login to add a commentAdd a comment