న్యూఢిల్లీ: భారత్‌లో పట్టణ సేవల పురోగతికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 350 మిలియన్ డాలర్ల (రూ.2,625 కోట్లు)ను రుణంగా ఇవ్వనుంది. మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా ప్రభుత్వాలు సంస్కరణలను చేపట్టడంతోపాటు.. పనితీరు ఆధారితంగా పట్టణ పాలకమండళ్లకు నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు ఈ కార్యక్రమం అమలు విషయంలో ఏడీబీ సలహా, మద్దతు సేవలను అందించనుంది. ఇందుకు సంబంధించిన రుణ ఒప్పందంపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా, ఏడీబీ భారత్ డైరెక్టర్ టకియో కొనిషి సోమవారం సంతకాలు చేశారు. విధాపరమైన సంస్కరణలను అమలు చేయడంలో, పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పనకు సంబంధించి పట్టణ పాలక మండళ్లకు ఏడీబీ తన సేవలను అందిస్తుంది. వాతావరణం మార్పులు, పర్యావరణ, సామాజిక భద్రతా చర్యలను కూడా సూచిస్తుందని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలియజేసింది.
అసోంలో నైపుణ్య యూనివర్సిటీకి సాయం
అసోంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఏడీబీ మరో 112 మిలియన్ డాలర్లను రుణంగా ఇవ్వనుంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను బలోపేతం చేసేందుకు యూనివర్సిటీ ఏర్పాటు మార్గం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి ఏడీబీతో ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment