ఏఐఎన్‌యూలో ఏషియ‌న్ హెల్త్‌కేర్ హోల్డింగ్స్ మెజారిటీ వాటా | Asian Healthcare Holdings to acquire a majority stake in AINU | Sakshi
Sakshi News home page

ఏఐఎన్‌యూలో ఏషియ‌న్ హెల్త్‌కేర్ హోల్డింగ్స్ మెజారిటీ వాటా

Published Wed, Sep 20 2023 2:05 PM | Last Updated on Wed, Sep 20 2023 3:02 PM

Asian Healthcare Holdings holds a majority stake in AINU - Sakshi

హైద‌రాబాద్: సింగిల్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ డెలివ‌రీ ప్లాట్‌ఫాం అయిన ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ (ఏహెచ్‌హెచ్‌) సంస్థ‌.. యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల‌కు గాను దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ)లో మెజారిటీ వాటాను తీసుకుంది. ఏఐఎన్‌యూకు దేశంలోని నాలుగు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఆస్ప‌త్రులు ఉండ‌టంతో పాటు రోబోటిక్ యూరాల‌జీ స‌ర్జ‌రీల‌లో ముందంజ‌లో ఉన్న ఘ‌న‌త ఉంది. 

ప్రైమ‌రీ, సెకండ‌రీ ఇన్‌ప్యూజ‌న్ల ద్వారా ఏహెచ్‌హెచ్ ఈ సంస్థ‌లో రూ.600 కోట్ల పెట్టుబ‌డి పెడుతుంది.  ఏహెచ్‌హెచ్ ఇప్పుడు యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగంలోకి ఈ పెట్టుబ‌డి ద్వారా అడుగుపెట్ట‌డంతో నాలుగో స్పెషాలిటీలోకి కూడా వ‌చ్చిన‌ట్ల‌యింది.  త‌ద్వారా, భార‌త‌దేశంతో పాటు ఆసియా ఉప‌ఖండంలోనే ఏకైక అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ డెలివ‌రీ ప్లాట్‌ఫాం అవుతుంది. ఏహెచ్‌హెచ్ 2017లో ప్రారంభ‌మైంది. అప్ప‌టినుంచి ఆంకాల‌జీ (సీటీఎస్ఐ), మ‌హిళ‌లు, పిల్ల‌లు (మ‌ద‌ర్‌హుడ్ హాస్పిట‌ల్స్), ఐవీఎఫ్‌, సంతాన సాఫ‌ల్యం (నోవా ఐవీఎఫ్‌) ఆస్ప‌త్రుల‌లో వాటాలు తీసుకుంది. ఇవ‌న్నీ ఆయా రంగాల్లో నాయ‌క‌త్వ స్థానాల్లో ఉన్న‌వే. 

డాక్ట‌ర్ సి.మ‌ల్లికార్జున‌, డాక్ట‌ర్ పి.సి. రెడ్డిల నేతృత్వంలోని ప్ర‌ముఖ యూరాల‌జిస్టులు, నెఫ్రాల‌జిస్టులు క‌లిసి 2013లో ఏఐఎన్‌యూను స్థాపించారు. అప్ప‌టినుంచి దేశంలో యూరాల‌జీ, నెఫ్రాల‌జీ క్లినిక‌ల్ స్పెషాలిటీలో ప్ర‌ముఖ ఆస్ప‌త్రిగా ఎదిగింది. ఈ కంపెనీ ప్ర‌స్తుతం హైద‌రాబాద్, విశాఖ‌ప‌ట్నం, సిలిగురి, చెన్నై న‌గ‌రాల్లో ఏడు ఆస్ప‌త్రులు న‌డుపుతోంది. వీట‌న్నింటిలో క‌లిపి 500కు పైగా ప‌డ‌క‌లున్నాయి, 4 ల‌క్ష‌ల మందికి పైగా రోగుల‌కు చికిత్స చేసి, 50వేల ప్రొసీజ‌ర్లు పూర్తిచేసింది. రోబోటిక్ యూరాల‌జీ శ‌స్త్రచికిత్స‌ల‌లో ఏఐఎన్‌యూ నాయ‌క‌త్వ‌స్థానం సంపాదించింది. ఇప్ప‌టికి ఈ టెక్నాల‌జీతో వెయ్యికి పైగా ఆప‌రేష‌న్లు పూర్తిచేసింది. ఇక నెఫ్రాల‌జీ విభాగం విష‌యానికొస్తే, 2 ల‌క్ష‌ల‌కు పైగా డ‌యాల‌సిస్‌లు, 300 మూత్ర‌పిండాల మార్పిడి శ‌స్త్రచికిత్స‌లు ఇక్క‌డ చేశారు. 

“యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో ఏఐఎన్‌యూ ఒక విభిన్నమైన సింగిల్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ చైన్. ఆయా విభాగాల్లో ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న వైద్యులు.. క్లినిక‌ల్ నైపుణ్యం అనే పునాదిపై దీన్ని నిర్మించారు. ఏహెచ్‌హెచ్ ప్లాట్‌ఫాంలో ఏఐఎన్‌యూ కేవ‌లం ఒక కొత్త స్పెషాలిటీని క‌ల‌ప‌డ‌మే కాక‌, దేశంలో సింగిల్ స్పెషాలిటీ వైద్య‌వ్య‌వ‌స్థ‌ను మ‌రింత పెంచాల‌న్న మా ల‌క్ష్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తోంది. యూర‌లాజిక‌ల్ స‌మ‌స్య‌లు అత్యంత ఎక్కువగా ఉన్న టాప్‌-3 దేశాల్లో భార‌త్ కూడా ఒక‌టి. 

ఇక్క‌డ మ‌ధుమేహం, ర‌క్త‌పోటు అధికంగా ఉండ‌టంతో పాటు దీర్ఘ‌కాల మూత్ర‌పిండాల వ్యాధి (సీకేడీ) కూడా ఎక్కువ‌గా ఉంటోంది. దేశంలో యూరాల‌జీ, నెఫ్రాల‌జీ వైద్య‌సేవ‌ల‌కు ఉన్న డిమాండుకు, స‌ర‌ఫ‌రాకు మ‌ధ్య ఉన్న అంత‌రాన్ని పూడ్చేందుకు ఏఐఎన్‌యూ మాతో క‌ల‌వ‌డం మాకెంతో సంతోషంగా ఉంది” అని ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ విశాల్ బాలి తెలిపారు. 

ఏఐఎన్‌యూ తన ఆస్ప‌త్రుల‌న్నింటిలో యూరాలజీ స‌మ‌స్య‌లకు అత్యాధునిక చికిత్సను అందిస్తుంది. దీని సమగ్ర సేవలలో మూత్ర‌పిండాల్లో రాళ్లు, యూరాలజీ క్యాన్సర్లు, ప్రోస్టేట్ వ్యాధులు, పునర్నిర్మాణ యూరాలజీ శస్త్రచికిత్స, లాపరోస్కోపిక్ యూరాలజీ, ఆండ్రాలజీకి రోగనిర్ధారణ, చికిత్స ఉన్నాయి. నెఫ్రాలజీ విభాగంలో తీవ్రమైన, దీర్ఘకాలిక, తుది ద‌శ‌ మూత్రపిండ వ్యాధులకు (ఇఎస్ఆర్‌డీ) చికిత్సను అందిస్తారు. అలాగే మెరుగైన క్లినికల్ ఫలితాలను అందించడానికి హై-ఎండ్ హిమోడయాఫిల్టరేషన్ (హెచ్‌డీఎఫ్) యంత్రాలతో కూడిన అత్యాధునిక డయాలసిస్ యూనిట్ ఉంది.

“భార‌తీయులకు మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌లు, కేన్స‌ర్ ర‌హిత ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ స‌మ‌స్య‌లు ఎక్కువ‌. గ‌త ద‌శాబ్ద కాలంలో యూర‌లాజిక‌ల్ కేన్స‌ర్లు కూడా ఎక్కువ కావ‌డాన్ని మేం గ‌మ‌నించాం. ప్రోస్టేట్, బ్లాడ‌ర్ కేన్స‌ర్లు ఎక్కువ‌వుతున్నాయి. మా బృందం యూర‌లాజిక‌ల్ కేన్స‌ర్ల‌కే వెయ్యి రోబోటిక్ స‌ర్జ‌రీలు చేసింది. కేవ‌లం భార‌తీయ న‌గరాల్లోనే కాక‌, 2టైర్ ప‌ట్ట‌ణాల్లోనూ రోబోటిక్ యూరాల‌జీ స‌ర్జ‌రీల‌ను అందుబాటులోకి తెస్తున్నాం. రాబోయే సంవ‌త్స‌రాల్లో యూరో-ఆంకాల‌జీ, యూరో-గైన‌కాల‌జీ, పీడియాట్రిక్ యూరాల‌జీ కేసులు పెరిగే అవ‌కాశాలున్నాయి. ఏహెచ్‌హెచ్ రాబోయే కాలంలో మా త‌దుప‌రి ద‌శ వృద్ధికి స‌రైన భాగ‌స్వామి అవుతుంద‌ని న‌మ్ముతున్నాం” అని ఏఐఎన్‌యూ చీఫ్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సి. మ‌ల్లికార్జున చెప్పారు. 

“భారతదేశ‌ జనాభాలో సుమారు 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షకు పైగా మూత్రపిండాల వైఫల్యం కేసులు నమోదవుతున్నాయి. ఇది భారతదేశంలోని రోగులకు నెఫ్రాలజీ చికిత్స‌ల‌పై దృష్టి సారించాల్సిన అవ‌స‌రాన్ని పెంచుతోంది.  దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్నందున, క్లినికల్ ఫలితాలను మెరుగుపరచడానికి, మెరుగైన రోగి సంరక్షణ కోసం డయాలసిస్, మూత్ర‌పిండాల‌ మార్పిడిలో సాంకేతిక పురోగతి చాలా అవసరం” అని ఏఐఎన్‌యూ సీనియర్ యూరాలజిస్ట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పిసి రెడ్డి అన్నారు. 

2022లో భారతదేశం సుమారు 1.89 కోట్ల నెఫ్రాలజీ, యూరాలజీ విధానాలను నమోదు చేసింది. వచ్చే ఐదేళ్లలో సిఎజిఆర్ 8-9% పెరుగుతుందని అంచనా. భారత్ లో 6,000 మంది యూరాలజిస్టులు, 3,500 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 350 మంది యూరాలజిస్టులు, 250 మంది నెఫ్రాలజిస్టులు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేస్తున్నారు. లాపరోస్కోపిక్, ఎండోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సా ఎంపికల పెరుగుదల దేశంలోని మెట్రోలు, ద్వితీయ శ్రేణి నగరాలలో ఎఐఎన్యుకు బలమైన వృద్ధి అవకాశాన్ని ఇస్తుంది.

ఏషియా హెల్త్ కేర్ హోల్డింగ్స్ గురించి
2017లో ప్రారంభ‌మైన ఏషియా హెల్త్ కేర్ హోల్డింగ్స్ (ఏహెచ్‌హెచ్) అనేది సింగ‌పూర్‌కు చెందిన సావరిన్ హెల్త్ ఫండ్ అయిన టిపిజి గ్రోత్, జిఐసి నిధులతో ఏర్ప‌డిన సింగిల్ స్పెషాలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌, ఆప‌రేటింగ్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం. భారతదేశంలోని 11 నగరాల్లో 23 చోట్ల మహిళలు, పిల్లల ఆసుపత్రుల సమగ్ర నెట్‌వ‌ర్క్ అయిన మదర్‌హుడ్ హాస్పిటల్స్ దీని ప‌రిధిలో ఉన్నాయి. దాంతోపాటు భారతదేశం, దక్షిణాసియాలోని 44 నగరాల్లో 68 ఐవిఎఫ్ సెంటర్లున్న‌ నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీని కూడా ఏహెచ్‌హెచ్ కలిగి ఉంది. ఏహెచ్‌హెచ్ భారతదేశంలోని రెండో అతిపెద్ద ఆంకాలజీ ఆసుపత్రుల చైన్ అయిన సీటీఎస్ఐని ఏర్పాటుచేసి, 2019 లో కంపెనీ నుంచి నిష్క్రమించింది.  

ఏఐఎన్‌యూ గురించి
ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) అనేది యూరాల‌జీ, నెఫ్రాల‌జీ చికిత్స‌ల‌కు భార‌త‌దేశంలో అతి పెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి. దేశంలోని నాలుగు న‌గ‌రాల్లో ఏడు ఆస్ప‌త్రులు ఉన్నాయి. వీటిలో నెఫ్రాల‌జిస్టులు, యూరాల‌జిస్టుల‌తో కూడిన బృందాలు ఉన్నాయి. యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో క్లినిక‌ల్ నైపుణ్యాల‌కు ఇది పెట్టింది పేరు. 

దాంతోపాటు యూరో-ఆంకాల‌జీ, రీక‌న్‌స్ట్ర‌క్టివ్ యూరాల‌జీ, పీడియాట్రిక్ యూరాల‌జీ, ఫిమేల్ యూరాల‌జీ, ఆండ్రాల‌జీ, మూత్ర‌పిండాల మార్పిడి, డ‌యాల‌సిస్ లాంటి సేవ‌లూ అందిస్తుంది.  రోబోటిక్ యూరాల‌జీ శ‌స్త్రచికిత్స‌ల‌కు దేశంలోనే ఇది ఆద‌ర్శ‌ప్రాయం. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఈ ఆస్ప‌త్రి నెట్‌వ‌ర్క్‌లో 500 ప‌డ‌క‌లు ఉన్నాయి, ఇప్ప‌టివ‌ర‌కు ల‌క్ష మందికిపైగా రోగుల‌కు చికిత్స‌లు చేసింది. ఏఐఎన్‌యూకు ఎన్ఏబీహెచ్, డీఎన్‌బీ (యూరాల‌జీ, నెఫ్రాల‌జీ), ఎఫ్ఎన్‌బీ (మినిమ‌ల్ ఇన్వేజివ్ స‌ర్జ‌రీ)ల గుర్తింపు ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement