టీవీ రిమోట్ గురుంచి జరిగే గొడలు మనం ప్రతి ఇంట్లో చూస్తూనే ఉంటాం. నచ్చిన ప్రోగ్రామ్‌ను చూసేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా పోటీ పడుతూ ఉంటారు. అయితే స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఈ గొడవ తీరిందని కొందరు అంటారు గానీ, పెద్ద టీవీపై సినిమా వీడియోలు చూసేందుకు, ఆరు అంగుకాల మొబైల్ స్క్రీన్‌పై చూసేందుకు చాలా తేడా ఉంది. అయితే... గదికో టెలివిజన్ పెట్టుకోవాలా? అని అడగకండి. ఎంచక్కా పైన ఫాటోలో ఉన్న 'జెన్‌బీమ్ లట్టె' పోర్టబుల్ ప్రాజెక్టర్‌ను తెచ్చేసుకుంటే సరిపోతుందని అంటోంది తైవాన్ స్మార్ట్ ఫోన్ కంపెనీ అసుస్.(చదవండి: ఇక టెలివిజనూ.. వైర్‌లెస్)
అరచేతిలో ఇమిడిపోయేంత సైజు మాత్రమే ఉండే ఈ ప్రొజెక్టర్ తో గోడపై 120 అంగుళాల సైజున్న బొమ్మ చూడవచ్చు. పిక్చర్ క్వాలిటీ 720 పిక్సెల్ వరకూ ఉంటుంది. ఇంటి లోపల, బయట కూడా యూట్యూబ్ వీడియోలు, వీడియో గేమ్స్ ఆడేందుకు అనువైంది ఈ జెన్‌బీమ్ లట్టె. అవసరమైతే కిక్‌స్టాండ్‌పై లేదా ట్రైపాడ్‌పై కూడా ఏర్పాటు చేసుకుని నచ్చిన సినిమాను ఎంచక్కా చూసేయవచ్చు. ప్రొజెక్టర్ ద్వారా వచ్చే వెలుగు ఓ మోస్తరుగా (300 లూమెన్స్) ఉంటుంది. గదిలో కిటికీలన్నీ మూసుకుని, లైట్లు ఆర్పేసుకుంటే బొమ్మ స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ చెబుతోంది. ఆడియో కోసం ఇందులోనే పది వాట్ల స్పీకర్‌ను ఏర్పాటు చేశారు. సినిమాలు, వీడియోలు, సంగీతం కోసం వేర్వేరుగా ఆడియో సెట్టింగ్స్ ఉన్నాయి. 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ డివైస్‌ను ఏకధాటిగా 3 గంటల పాటు వాడొచ్చు. ఈ ఏడాది కన్స్యూమర్ ఎలక్రానిక్స్, టెక్నాలజీ షో (సీఈఎస్ 2021)లో తొలిసారి ప్రదర్శించిన 'జెన్‌బీమ్ లట్టె' ధర తేలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment