దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ అథర్ ఎనర్జీ వాహనదారులకు భారీ షాకిచ్చింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, లాజిస్టిక్స్ సవాళ్ల నేపథ్యంలో వెహికల్స్ ధరల్ని పెంచతున్నట్లు ప్రకటించింది.
ఆటో మొబైల్ మార్కెట్‌లో ఇతర సంస్థలు ఆయా వెహికల్స్ ధరల్ని పెంచుకుంటూ పోతే ఒక్క అథర్ ఎనర్జీ మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కోవిడ్ కారణంగా ముడిసరుకులు పెరగడంతో పాటు ఇతర కారణాల వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఈ పెరుగుదల డైరెక్ట్‌గా కాకుండా..వెహికల్స్‌కి ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జర్ ధరల్ని పెంచినట్లు చెప్పింది. వాస్తవానికి అథర్ ఎనర్జీ డాట్ పోర్టబుల్ ఛార్జర్ ధర రూపాయి మాత్రమే ఉండగా.. ఆ ధర కాస్త ఇప్పుడు రూ.5,475కు పెరగడం గమనార్హం.
అథర్ ఎనర్జీ
అథర్ ఎనర్జీ 'అథర్ ఎనర్జీ 450 ప్లస్, అథర్ 450 ఎక్స్' రెండు వేరియంట్ల స్కూటర్లపై అమ్మకాలు జరుపుతుంది. బెంగళూరులో అథర్ ఎనర్జీ 450 ప్లస్ రూ. 1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, అథర్ ఎనర్జీ 450 ఎక్స్ ధర రూ. 1.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్ల ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ప్రతి రాష్ట్రంలో అందించే ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీలను బట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు మారిపోతుంటాయి. కాగా, గత ఏడాది నవంబర్‌లో అథర్ ఎనర్జీ హోసూర్ కేంద్రంగా తన రెండవ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండో యూనిట్ అందుబాటులోకి వస్తే ఈ ఏడాది చివరి నాటికి సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 1.20 లక్షల యూనిట్ల నుండి సంవత్సరానికి 4-లక్షల వాహనాలకు విస్తరిస్తుందని ఆథర్ ఎనర్జీ ప్రతినిధులు తెలిపారు.
పెద్ద సంస్థలు.. భారీ పెట్టుబడులు
2013లో బెంగళూరు కేంద్రంగా తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ లు ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో హీరో మోటోకార్ప్, టైగర్ గ్లోబల్, ఫ్లిప్‌కార్ట్ కోఫౌండర్ సచిన్ బన్సల్‌లు భారీ పెట్టుబుడులు పెట్టారు. బెంగుళూరు కేంద్రంగా అథర్ ఎనర్జీ సంస్థను ప్రారంభించగా.. ఆ సంస్థ వెహికల్స్ కొనుగోళ్లు పెరగడంతో ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇందుకోసం వచ్చే 5ఏళ్లలో రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment