prices range
-
విడుదలకు ముందే వన్‌ప్లస్ ట్యాబ్ ధరలు లీక్
టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో రోజు రోజుకి కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అలాంటి కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతుంటాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 'వన్‌ప్లస్' (OnePlus) తన మొదటి ట్యాబ్‌ను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కొత్త ట్యాబ్ విడుదలకు ముందే ధరల వివరాలు లీక్ అయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న వన్‌ప్లస్ ప్యాడ్ ట్యాబ్‌ను కంపెనీ గత ఫిబ్రవరిలోనే పరిచయం చేసింది. అయితే ఆ సమయంలో కంపెనీ ఈ ప్రొడక్ట్ లాంచ్, ప్రైస్ వంటి వాటిని వెల్లడించలేదు. కంపెనీ అధికారిక ధరలను వెల్లడించకముందే ఈ ట్యాబ్ రూ. 23,099 దరిదాపుల్లో ఉంటుందని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. లీకైన ధరలను బట్టి చూస్తే ఈ ట్యాబ్ సరసమైన ధర వద్ద లభించే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తుంన్నారు. విడుదల సమయంలో కంపెనీ దీని ధరలను వెల్లడిస్తుంది. (ఇదీ చదవండి: ఇప్పుడు పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!) త్వరలో విడుదలకానున్న వన్‌ప్లస్ ప్యాడ్ 11.61 ఇంచెస్ 2.8K ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ పొందుతుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ వంటి వాటితో పాటు మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే, ఈ కొత్త ట్యాబ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి 9,510mAh బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం నాలుగు స్పీకర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ట్యాబ్ కోసం ఇప్పటికే అమెరికా, యూకేలలో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. ఇండియాలో ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్
సాక్షి, ముంబై: జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారతీయ వినియోగదారులకు షాకిచ్చింది. భారత మార్కెట్లో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. అన్ని రకాల మోడళ్లపై దాదాపు 2శాతం వరకు ధరలు పెంచు తున్నట్టు ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగాధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. సవరించిన కొత్త ధరలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. వర్టస్, టైగన్ ,కొత్త టిగువాన్ మొదలు భారతదేశంలోని ఫోక్స్‌వ్యాగన్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో అంతటా ధరల పెంపు అమల్లో ఉంటుందని పేర్కొంది. కొత్త ధరల జాబితాను వెల్లడించనప్పటికీ, కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో 2శాతం వరకు వరకు పెంపు ఉంటుందని తెలిపింది. దీంతో ప్రస్తుతం రెండు ట్రిమ్స్‌లో అందుబాటులో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ధర రూ. 11.22 లక్షల నుండి ప్రారంభమై రూ. 17.92 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. ఇక టైగన్ ఎస్యూవీ ప్రస్తుతం రూ. 11.39 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉన్న ధర పెంపు తర్వాత రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. -
ఈసీబీ వడ్డీరేటు: బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి!
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ధరలతో తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఇప్పటికే భారీగా తగ్గిన పసిడి ధర శుక్రవారం రివర్స్ అయింది. బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్సైట్ ప్రకారం స్పాట్ మార్కెట్లో 999 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల క్రితం ముగింపు 49,972 రూపాయలతో పోలిస్తే 705 పెరిగింది, ప్రారంభ ధర రూ. 50,677గా ఉంది, అలాగే వెండి కిలో ధర 1,178 పెరిగి రూ. 55,085 పలుకుతోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) గురువారం వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచినప్పటికీ బంగారం ధరలు తగ్గాయి. స్పాట్ బంగారం ధర ఔన్సుకు 1716 డాలర్లు పలుకుతోంది. గురువారం ముగింపుతో పోలిస్తే దాదాపు 0.25 శాతం తక్కువ. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ధర స్వల్పంగా తగ్గి 10 గ్రాములకు రూ 50,361గా ఉంది. ఎంసీక్స్ మార్కెట్లో బంగారం ధర సమీప కాలంలో 10 గ్రాములు రూ. 49,300 వరకు తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి."గురువారం బంగారం ధరలు దాదాపు ఏడాదిలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. జూలై 27న 2022న జరగనున్న సమావేశంలో ఫెడ్ వడ్డీ రేటును పెంచుతుందనే ఊహాగానాలపై డాలర్ ఇండెక్స్ పెరుగుతుందని కమోడిటీ మార్కెట్ నిపుణుల భావిస్తున్నారు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి గురువారం రూ.50,180 వద్ద ఉండగా శుక్రవారం 50620గా ఉంది. 22 క్యారెట్ల రూ.46,400గా ఉంది. కిలో వెండి 200 రూపాయలు క్షీణించి 55400 పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి 18. 76 డాలర్లుగా ఉన్నది. #Gold and #Silver Opening #Rates for 22/07/2022#IBJA pic.twitter.com/akTslTJbzt — IBJA (@IBJA1919) July 22, 2022 కాగా దేశీయంగా దిగుమతి సుంకం పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల డిమాండ్ ఐదు శాతం తగ్గి 550 టన్నులకు చేరుకోనుందని తాజా నివేదికలో తేలింది. జూన్ 30, 2022న బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. -
మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్: ధరలు ఎలా ఉన్నాయంటే..!
Mahindra Scorpio N Price, సాక్షి,ముంబై: మహీంద్ర లేటెస్ట్ మిడ్ సైజ్ వెహికల్ 2022 మహీంద్రా స్కార్పియో-N ధరలను కంపెనీ ప్రకటించింది. లాంచ్ అయిన నెల తరువాత ఆల్-న్యూ మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్ వేరియంట్లు, టాప్-స్పెక్ 4X4 ట్రిమ్ వేరియంట్ల ధరలు తాజాగా బహిర్గత మైనాయి. వేరియంట్ వారీగా ఈ కారు ధరలు రూ. 11.99 లక్షల నుండి రూ. 23.90 లక్షల (ఎక్స్-షోరూం) వరకు ఉండనున్నాయి. బుకింగ్‌లు ఆన్లైన్లో, ఏకకాలంలో మహీంద్రా డీలర్‌షిప్‌లలో జూలై 30, ఉదయం 11 గంటల నుండి ప్రారంభం. బుకింగ్‌లు 'ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్' ప్రాతిపదికన, కస్టమర్ ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి డెలివరీ తేదీ ఆధారపడి ఉంటుంది.సెప్టెంబరు 26న ప్రారంభమయ్యే రాబోయే పండుగ సీజన్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 15 అర్ధరాత్రి వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే బుకింగ్ ఎడిట్ చేసుకునే చాన్స్ ఉంటుంది. మాన్యువల్ ట్రిమ్ తో పోలిస్తే Z4 నుండి Z8 L వరకు ప్రతి ఆటోమేటిక్ ట్రిమ్ ధర 1.96 లక్షలు అదనం. అంతేకాదు ప్రారంభ ధరలు మొదటి 25,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయని మహీంద్రా తెలియజేసింది. 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ మహీంద్రా స్కార్పియో-ఎన్ గత నెలలో ఇండియాలో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద ప్రారంభించగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 23.90 లక్షలుగా ఉంటుంది. ఐదు ట్రిమ్స్‌లో లభ్యం. Z2, Z4, Z6, Z8 & Z8 L, అనే వేరియంట్లలో పెట్రోలు, డీజిల్ వెర్షన్లో అందుబాటులో ఉన్నాయి. 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: వేరియంట్ వారీగా ధరలు (ఎక్స్-షోరూమ్) Z2 రూ.11.99 లక్షలు నుంచి రూ.12.49 లక్షలు Z4 ధరలు: రూ.13.49 లక్షలు, రూ.15.45 లక్షలు, రూ.13.99 లక్షలు, రూ.16.44 లక్షలు రూ.15.95 లక్షలు, రూ.18.40 లక్షలు Z6 ధరల: రూ.14.99 లక్షలు , రూ.16.95 లక్షలు Z8 ధరలు: రూ.16.99 లక్షలు, 18.95 లక్షలు, 17.49 లక్షలు, 19.94 లక్షలు, రూ19.45 లక్షలు రూ.21.90 లక్షలు Z8 L ధర : రూ.18.99 లక్షలు, రూ.20.95 లక్షలు, రూ.19.49 లక్షలు, రూ.21.94 లక్షలు రూ.21.45 లక్షలు, రూ. 23.90 లక్షలు -
పెట్రోల్ వాహనాలతో సమానంగా ఈవీల రేట్లు
న్యూఢిల్లీ: ఏడాది వ్యవధిలోగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ధరలు పెట్రోల్ వాహనాల రేట్లతో సమాన స్థాయికి తగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. పెట్రోల్, డీజిల్ స్థానంలో పంటల వ్యర్ధాల నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా శిలాజ ఇంధనాల దిగుమతుల భారాన్ని తగ్గించుకోవచ్చని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాటరీల వ్యయాలు భారీగా ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు చాలా అధిక స్థాయిలో ఉంటున్నాయి. వాహనం ధరలో బ్యాటరీల వాటా 35–40 శాతం మేర ఉంటుంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహనాల విభాగంలో సంప్రదాయ ఇంధనాల వాహనాలతో పోలిస్తే ఎంట్రీ స్థాయి ఈవీ రేటు దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఇక ద్విచక్ర వాహనాల విభాగంలోనూ పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెర్షన్ల రేటు 1.5 రెట్లు ఎక్కువగా ఉంటోంది. కాలుష్యకారక ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునే దిశగా పర్యావరణహిత విధానాలను ప్రోత్సహిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. -
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు భారీ షాక్, రూపాయి ధర కాస్త రూ.5 వేలకు పెరిగింది
దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ అథర్ ఎనర్జీ వాహనదారులకు భారీ షాకిచ్చింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, లాజిస్టిక్స్ సవాళ్ల నేపథ్యంలో వెహికల్స్ ధరల్ని పెంచతున్నట్లు ప్రకటించింది. ఆటో మొబైల్ మార్కెట్లో ఇతర సంస్థలు ఆయా వెహికల్స్ ధరల్ని పెంచుకుంటూ పోతే ఒక్క అథర్ ఎనర్జీ మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కోవిడ్ కారణంగా ముడిసరుకులు పెరగడంతో పాటు ఇతర కారణాల వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఈ పెరుగుదల డైరెక్ట్‌గా కాకుండా..వెహికల్స్‌కి ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జర్ ధరల్ని పెంచినట్లు చెప్పింది. వాస్తవానికి అథర్ ఎనర్జీ డాట్ పోర్టబుల్ ఛార్జర్ ధర రూపాయి మాత్రమే ఉండగా.. ఆ ధర కాస్త ఇప్పుడు రూ.5,475కు పెరగడం గమనార్హం. అథర్ ఎనర్జీ అథర్ ఎనర్జీ 'అథర్ ఎనర్జీ 450 ప్లస్, అథర్ 450 ఎక్స్' రెండు వేరియంట్ల స్కూటర్లపై అమ్మకాలు జరుపుతుంది. బెంగళూరులో అథర్ ఎనర్జీ 450 ప్లస్ రూ. 1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, అథర్ ఎనర్జీ 450 ఎక్స్ ధర రూ. 1.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్ల ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ప్రతి రాష్ట్రంలో అందించే ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీలను బట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు మారిపోతుంటాయి. కాగా, గత ఏడాది నవంబర్‌లో అథర్ ఎనర్జీ హోసూర్ కేంద్రంగా తన రెండవ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండో యూనిట్ అందుబాటులోకి వస్తే ఈ ఏడాది చివరి నాటికి సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 1.20 లక్షల యూనిట్ల నుండి సంవత్సరానికి 4-లక్షల వాహనాలకు విస్తరిస్తుందని ఆథర్ ఎనర్జీ ప్రతినిధులు తెలిపారు. పెద్ద సంస్థలు.. భారీ పెట్టుబడులు 2013లో బెంగళూరు కేంద్రంగా తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ లు ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో హీరో మోటోకార్ప్, టైగర్ గ్లోబల్, ఫ్లిప్‌కార్ట్ కోఫౌండర్ సచిన్ బన్సల్‌లు భారీ పెట్టుబుడులు పెట్టారు. బెంగుళూరు కేంద్రంగా అథర్ ఎనర్జీ సంస్థను ప్రారంభించగా.. ఆ సంస్థ వెహికల్స్ కొనుగోళ్లు పెరగడంతో ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇందుకోసం వచ్చే 5ఏళ్లలో రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. చదవండి: ఒక్క కారు ధర రూ.3.50 కోట్లు..ఐనా సరే కొనాల్సిందే ! -
పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ మంటెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతో సిలిండర్ల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి. దీంతో వంట గ్యాస్ సిలిండర్ ధర బుధవారం రూ.15 పెరిగింది. ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.899.50చేరింది. కాగా సెప్టెంబర్ నెలలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఇక తాజాగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం గ్యాస్ ధర రూ.190 పెంచినట్లైంది. చమరు కంపెనీలు రెండు నెలల్లో నాన్ సబ్సిడీ గ్యాస్ సిలీండర్ ధరలు అమాంతం పెంచాయి. ఆగస్ట్ 18న నాన్ సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర ను రూ.25 పెంచగా..సెప్టెంబర్ నెలలో ఇదే నాన్ సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 పెరగడంతో సామాన్యులు లబోదిబో మంటున్నారు. మరింత పెరగనున్న వంట గ్యాస్ ధరలు ఒకవైపు కరోనా..మరో వైపు ఆదాయం లేక సామాన్యుడు అప్పుల ఊబిలో చితికి పోతుంటే పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలు మరింత శాపంగా మారాయి. పెట్రోల్, డీజిల్ వంట నూనెలతో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరగటం.. ఇపుడు గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడం మరింత భారం కానుంది. అయితే ఈ పెరుగుతున్న ధరల భారం కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య కాలంలో నేచురల్ గ్యాస్ ధర 50 నుంచి 60శాతం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే గ్యాస్ ధర ఆకాశాన్ని తాకనుంది. చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
Shilpa Ramam: ‘శిల్పారామం’లో శుభకార్యాలకు ధరలు ఎంతో తెలుసా..
సాక్షి, మాదాపూర్(హైదరాబాద్): పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్న మాదాపూర్ శిల్పారామం వివాహాది శుభకార్యాలకు వేదికగా కూడా నిలుస్తోంది. మొత్తం 45 ఎకరాల్లో శిల్పారామం విస్తరించి ఉంది. కేవలం సందర్శకులు తిలకించేందుకే కాకుండా వివాహాది శుభకార్యాలు చేసుకొనేందుకూ అధికారులు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక ప్రదేశాలను శిల్పారామంలో అందుబాటులో ఉంచారు. శిల్పారామంలోని వేదికలు ఇవే.. ► శిల్పారామంలో వివాహాది శుభకార్యాల కోసం ఈ కింది వేదికలు ఇస్తారు. ► ఏ ప్రదేశాన్ని బుకింగ్ చేసుకున్నా.. తప్పనిసరిగా రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సందర్శకులను ఆకట్టుకొనేందుకు... ► చిన్నపిల్లలు, తల్లిదండ్రులు సరదాగా గడిపేందుకు ఉయ్యాలలు, పిల్లలకు మేధాశక్తి పెరిగేందుకు ఉపయోగపడే ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. ► కోనసీమ, బోటింగ్, బ్యాటరీకారు, ఎడ్లబండి వంటివి ఆకట్టుకునేలా ఉంటాయి. గ్రీనరీ, పూలమొక్కలు, ఆకర్షణీయమైన చెట్లు ఇక్కడి ప్రత్యేకతలు: ► సందర్శకులకు మరింత ఆకట్టుకునేలా రకరకాల పక్షులను పెంచుతున్నారు. ► వివిధ రకాల పక్షుల కోసం 12 కేవ్లు ఏర్పాటు చేశారు. ► రాతితో తయారు చేసిన సందేశాత్మక విగ్రహాలు ఏర్పాటు చేశారు. ► సందర్శకులు వీటి వద్ద ఫొటోలకు ఫోజులిస్తూ సరదాగా గడుపుతుంటారు. ► వీకెండ్స్‌లో ఆంపీ థియేటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా మేళాల నిర్వహణ ... ► ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు నిర్వహించే మేళాలో దాదాపు 550 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ► దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. విద్యార్థులు, దివ్యాంగులకు రాయితీ.. ► 10వ తరగతి వరకు చదివేవారికి 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ► పాఠశాల నుంచి లేఖ తీసుకొచ్చి కార్యాలయంలో అందజేయాలి. ► దివ్యాంగులు, స్వచ్చంద సంస్థల వారికి కూడా 50 శాతం రాయితీ ఇస్తారు. ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.. శిల్పారామం అంటే కేవలం సందర్శకులకే కాకుండా శుభకార్యాలను నిర్వహించుకునేందుకు కూడా అవ కాశం కల్పిస్తున్నాం. వీటి కోసం ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేశాం. ఇక్కడ తరచూ శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ వేదిక కోసం ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లోనూ ముందుగా బుక్ చేసుకోవాలి. – జి.అంజయ్య, శిల్పారామం జనరల్ మేనేజర్ చదవండి: వినూత్న ఆలోచనలను ఆవిష్కరించండి -
దేశంలో బంగారం ధరలు తగ్గాయ్, తొలిసారే ఇలా
జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు హెచ్చు తగ్గులతో దోబూచులాడుతున్నాయి. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో నమోదవుతున్న వేరియంట్ కేసులు, అమలు చేస్తున్న ఆంక్షల ప్రభావం పసిడి ధరలపై చూపిస్తోంది. దీంతో జులై నెల ప్రారంభం నుంచి తారాస్థాయిలో ఉన్న ధరలు జులై 17 నాటికి కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారం రోజు నాటికి పసిడి ధరలపై బంగారం వ్యాపారాలు ఆఫర్లు ప్రకటించారు. గత వారం ప్రీమియంతో పోలిస్తే ఈవారం ఔన్స్ బంగారం ధరను 5 డాలర్ల వరకు తగ్గింది.మనదేశంలో గరిష్ట స్థాయిలో రూ. 48,389 వద్ద ఉండగా శుక్రవారం 10 గ్రాములకి రూ.48,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. యూఎస్ మార్కెట్ లో బంగారం ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగో సారి లాభాల బాటపట్టాయి. యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు బంగారం ధరలు పెరగడానికి కారణమైందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం నాటికి ఔన్స్ ధర 1815 డాలర్ల వద్ద క్లోజ్ అయ్యింది.ద్రవ్యోల్బణం మందగమనంలో ఉన్నప్పటికి యుఎస్ ఆర్థిక వ్యవస్థకు సెంట్రల్ బ్యాంక్ మద్దతు ఇవ్వడాన్ని పావెల్ సమర్థించారు. ధరల ఒత్తిడిని తాత్కాలికంగా చూస్తున్నట్లు తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పసిడి ధరలపై ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి : తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు పైగా డిస్కౌంట్స్ కూడా -
తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్ని బట్టి డిస్కౌంట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ పలు మోడళ్లపై 33 శాతం వరకు ధరలను తగ్గించింది. ఫేమ్–2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీలను పెంచిన నేపథ్యంలో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మోడల్‌నుబట్టి 12 నుంచి 33 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. మహమ్మారి ఉన్నప్పటికీ గతేడాది అమ్మకాలు జోరుగా సాగాయని కంపెనీ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు. 2024 మార్చి వరకు ఫేమ్–2 ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఫేమ్–2 స్కీమ్‌ను 2024 మార్చి 31 వరకు పొడిగిస్తూ భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. 2015లో ఫేమ్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తే కస్టమర్‌కు రాయితీ కల్పిస్తారు. -
Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్ బయోటెక్
సాక్షి, న్యూఢిల్లీ: కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలపై దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయెటెక్ ఉసూరు మనిపించింది. ప్రైవేట్లోఎట్టిపరిస్థితుల్లోనూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలను తగ్గించలేమని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక విఢుదల చేసింది. తమకు నష్టాలొస్తున్నప్పటికీ, ఇప్పటికే తక్కువ ధరకే కేంద్రానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని చెప్పింది. కేంద్రానికి ఒక వ్యాక్సిన్ డోసును కేవలం రూ.150లకే అందిస్తున్నామని కోవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటక్ వెల్లడించింది. ఎక్కువ కాలం ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ ను సరఫరా చేయలేమని పేర్కొంది. అలాగే తమ ఉత్పత్తిలో 10శాతం కంటే తక్కువవే ప్రైవేట్ ఆస్పత్రులకు, మిగిలిన వాటిని రాష్ట్రానికి, కేంద్రానికి సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగానికి సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను తగ్గించలేమని భారత్ బయోటెక్ తేల్చి చెప్పింది. నష్టాలను పూడ్చుకునేందుకే ప్రైవేటులో ఈ ధరలను అమలు చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది. -
బైక్ ధరలను పెంచేసిన హీరో మోటో
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్‌కి షాకిచ్చింది. వచ్చే నెలనుంచి తన మోటార్ సైకిళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులరీత్యా తమ అన్ని మోడళ్ల బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచాల్సి వస్తోందని ప్రకటించింది. సవరించిన ధరలు అన్ని షోరూంలలో 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో సంస్థ వెల్లడించింది. (మారుతి కార్ల ధరలకు రెక్కలు) వినియోగదారుల మీద తక్కువ భారం పడేలా, తమ ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్టు హీర మోటో తెలిపింది. అయితే ధరల పెరుగుదల పరిమాణంపై కంపెనీ నిర్దిష్ట వివరాలు ఇవ్వలేదు. కానీ, ఈ పెరుగుదల రూ .2500 వరకు ఉంటుందని, మోడల్, నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ఉంటుందని హీరో తెలిపింది. కాగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇన్పుట్ ఖర్చుల భారం నేపథ్యంలో అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఊరట: దిగొస్తున్న పుత్తడి ధరలు
సాక్షి, ముంబై: నిన్నమొన్నటి దాకా చుక్కల్ని తాకిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అన్‌సీజన్, ద్రవ్యోల్బణ ఆందోళనలు, డాలర్ బలం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ పుత్తడి గరిష్టాలనుంచి వెనక్కి తగ్గుతోంది. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 తగ్గి ధర 47,340 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల కూడా రూ.10 క్షీణించి రూ. 43,390కు చేరుకుంది. దేశీయ ఫ్యూచర్మార్కెట్లో పసిడి పదిగ్రాములకు28 రూపాయలు క్షీణించి 46213 వద్ద ఉండగా, 500 రూపాయలు పడిన వెండి 68700 స్థాయికి చేరింది. బంగారం ధరలు 8 నెలల కనిష్టానికి సమీపానికి చేరువలో ఉండటంతోపాటు, రికార్డు స్థాయినుంచి 10 వేల రూపాయలు దిగి వచ్చినట్టయింది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల పుత్తడి ధర 46,750 స్థాయికిచేరింది. వెండి ధర సిల్వర్ ధర కిలోకు రూ .70,200 స్థాయికి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 350 రూపాయలు తగ్గి 45,550 రూపాయలకు చేరుకోగా, చెన్నైలో 450 రూపాయలు తగ్గి 43,720 రూపాయలకు పడిపోయింది. అటు యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం తగ్గి 1,767.60 డాలర్లకు చేరుకుంది. యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఏడాది గరిష్టానికి చేరడం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోందని డైలీఎఫ్ఎక్స్ వ్యూహకర్త మార్గరెట్ యాంగ్ వ్యాఖ్యానించారు. మెరుగైన ఆర్థిక సెంటిమెంట్ ,ద్రవ్యోల్బణ ఆందోళనలు యూఎస్ బాండ్ ఈల్డ్స్ గరిష్టానికి చేరాయనీ, ఇది బంగారంలో అమ్మకాలకు దారితీసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ కమోడిటీస్ హరీష్ వీ అన్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల భారీ పతనంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారిన సెన్సెక్స్ ఏకంగా 1540 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. దాదాపు అన్ని రంగాలు భారీగా నష్టపోతున్నాయి. -
2021లో బంగారం ధర ఎంత పెరగనుంది..?!
సాక్షి, ముంబై: కరోనా కాలంలో బంగారం ధర భారీగా పుంజుకుంది. ఈ ఏడాది 10 గ్రాముల పసిడి ధర వరుసగా పెరుగుతూ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. అయితే 2021 ఏడాదిలో కూడా పసిడి ధరల పరుగు మరింత వేగం అందుకుంటుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తాజా ఉద్దీపన చర్యలు, బలహీనమైన అమెరికన్ డాలర్ తదితర అంచనాల మధ్య, కొత్త సంవత్సరంలో బంగారం 10 గ్రాములకు 63,000 రూపాయలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. అగ్ర రాజ్యాల మధ్య యుద్ధ భయాలు, ట్రేడ్‌వార్ లాంటి వివిధ అనిశ్చిత సమయాల్లో పెట్టుబడికి ఎల్లప్పుడూ సురక్షితమైన స్వర్గంగా బంగారాన్ని పెట్టుబడిదారులు భావిస్తారు. దీనికి 2019 లో చైనాలో మొదలై ప్రపంచమంతా విస్తరించి 2020లో తీవ్ర కల్లోలాన్ని రేపిన కరోనా మహమ్మారి కూడా పుత్తడి ధరలనుభారీగా ప్రభావితం చేసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 56,191 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. అలాగే అంతర్జాతీయంగా ఆగస్టులో మార్కెట్లో ఔన్సు ధర 2,075 డాలర్లు పలికిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది (2020)లో 10 గ్రాముల పుత్తడి రూ.39,100 వద్ద ప్రారంభమై కరోనా విజృంభణతో 56,191 రూపాయల వద్ద ఆల్ టైం గరిష్టానికి చేరిందని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సీఈఓ జ్ఞానశేకర్ తియగరాజన్ తెలిపారు. అయితే కరోనావైరస్ వ్యాక్సిన్ లభ్యతపై భారీ ఆశలు, కోవిడ్-19 తరువాత ఆర్థిక పునరుజ్జీవనం ఉన్నప్పటికీ బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు బలంగా ఉందని ఆయన నమ్ముతున్నారు. డాలర్ ఇంకా బలహీనతను నమోదు చేయవచ్చు. ఇది కూడా 2021లో మరోసారి పెట్టుబడులను ఆకర్షించేందుకు సానుకూల అంశమని తియరాజన్ పేర్కొన్నారు. అంతేకాదు సెనేట్‌లో బలహీనమైన మెజారిటీ కారణంగా యుఎస్‌లో రాజకీయ ప్రమాదం, జో బిడెన్ నేతృత్వంలోని పరిపాలన సంస్కరణల అమలుకు గుదిబండగా మారుతుందినీ, ఇది బులియన్ మార్కెట్‌కు సానుకూల అంశమని అభిప్రాయపడ్డారు. అలాగే భారత, చైనాలోగత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న ఫిజికల్ గోల్డ్ డిమాండ్ 2021లో కీలక దశకు చేరుకుంటుందనీ, డిమాండ్ భారీగా పుంజుకుంటుందన్నారు. దీనికి తోడు రూపాయి కూడా స్థిరంగా ఉంటే, ధరలు 2021లో కనీసం రూ .60వేలను తాకవచ్చన్నారు. కోవిడ్-19 మహమ్మారి ఆంక్షలు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ఆందోళన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ అంచనా ప్రకారం వచ్చే ఏడాదిలో కామెక్స్ లో పుత్తడి ధర 2,150-2,390 డాలర్ల మధ్య కదలాడనుంది. అలాగే ఎంసీఎక్స్ లో 57 వేలు - 63 వేల రూపాయలు టార్గెట్‌గా ఉండనుంది. -
దిగొస్తున్న పుత్తడి ధర
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం ధరలు గరిష్ట స్థాయిలనుంచి దిగి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా క్షీణించాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు పుంజుకోవడం కూడా బంగారం ధరల బలహీనతకు కారణమని తెలిపారు. బుధవారం బంగారం 10 గ్రాములకి రూ .128 తగ్గి 41,148 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల స్పాట్ బంగారం రూ .128 తగ్గిందని మంగళవారం 10 గ్రాముల ధర రూ .41,276 వద్ద ముగిసింది. వెండి ధర కూడా మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే దిగి వచ్చింది. వెండి రూ .47,060 నుంచి కిలో ధర రూ .700 తగ్గి 46,360 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ఔన్స్ ధర వరుసగా 1,562.5 డాలర్లు, 17.51 డాలర్లుగా ట్రేడవుతున్నాయి. ఇటీవల కోవిడ్-2019 రేపిన ప్రకంపనలో ప్రధానంగా చమురు ధరలు పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులు బంగారం వైపు మళ్లాయి. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. -
కొత్త హ్యుందాయ్ ఎలంత్ర
♦ ధరల శ్రేణి రూ.12.99- రూ.19.19 లక్షలు ♦ ప్రారంభ ధరలు డిసెంబర్ వరకే హ్యుందాయ్ కంపెనీ ఎలంత్ర మోడల్లో కొత్త వేరియంట్లను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఆరో తరం ఎలంత్ర సెడాన్ ప్రారంభ ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ.19.19 లక్షల రేంజ్లో ఉంటాయని హ్యుందాయ్ ఇండియా పేర్కొంది. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ.17.99 లక్షలు, డీజిల్ వేరియంట్ ధరలు రూ.14.79 లక్షల నుంచి రూ.19.19 లక్షల రేంజ్లో(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించినట్లు కంపెనీ ఎండీ, సీఈఓ వైకే కూ చెప్పారు. ఈ ప్రారంభ ధరలు ఈ ఏడాది డిసెంబర్ వరకే అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ సెగ్మెంట్లో టయోట కొరొల్లా ఆల్టిస్, ఫోక్స్‌వ్యాగన్ జెటా, స్కోడా ఆక్టేవియా, జనరల్ మోటార్స్ క్రూజ్‌లు అమ్ముడవుతున్నాయి. వాటా పెరుగుదలపై ఆశాభావం.. హై డెన్సిటి డిస్చార్జ్ హెడ్‌ల్యాంప్స్, ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్, గ్లాస్ యాంటెన్నా, వాయిస్ రికగ్నిషన్ తదితర కొత్త ఫీచర్లు ఈ కొత్త వేరియంట్లలలో ఉన్నాయని కూ పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్లు 14.59-14.63 కిమీ. డీజిల్ వేరియంట్లు 18.23-22.45 కిమీ. మైలేజీని ఇస్తాయని వివరించారు. స్పోర్ట్స్‌యుటిలిటి వెహికల్(ఎస్యూవీ) మార్కెట్లో ఇప్పటికే తగినంత వాటా సాధించామని, ఈ కొత్త ఎలంత్ర వేరియంట్‌తో తమ మార్కెట్ వాటా మరింతగా పెరగగలదన్న ఆశాభావాన్ని కూ వ్యక్తం చేశారు. 1990లో ఎలంత్ర కారును ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం ప్రారంభించామని, ఇప్పటిదాకా 1.15 కోట్ల కార్లను అమ్మామని పేర్కొన్నారు. ఈ కొత్త ఎలంత్ర కారుతో ఎగ్జిక్యూటివ్ సెడాన్ సెగ్మెంట్లో అగ్రస్థానం సాధించగలమన్న అంచనాలున్నాయని చెప్పారు. ఈ సెగ్మెంట్లో ఆరు బ్రాండ్ల కార్లు నెలకు వెయ్యి అమ్ముడవుతున్నాయని, వీటిల్లో తమ వాటా 250 యూనిట్లని వివరించారు. ఈ కొత్త ఎలంత్ర కారణంగా ఈ సంఖ్య 350కు పెరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్/నవంబర్‌లో ప్రీమియమ్ ఎస్యూవీ టూసన్ను అందించనున్నామని కంపెనీ ఎండీ, సీఈఓ వైకే కూ చెప్పారు. ప్రతి ఏడాది రెండు కొత్త మోడళ్లు.. భారత్‌లో అగ్ర స్థానం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఏడాది రెండు తాజా మోడళ్లను అందుబాటులోకి తెస్తామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో తమ మార్కెట్ వాటా 17 శాతమని పేర్కొన్నారు. తమ అంతర్జాతీయ అమ్మకాల్లో భారత్ వాటా 13 శాతమని వివరించారు. ఏడవ వేతన సంఘం సిఫారసుల వల్ల అమ్మకాలు పెరగవచ్చని అంచనా.