ముంబై: గడిచిన రెండు దశాబ్దాల్లో ఈక్విటీ మార్కెట్లు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. కానీ, ఈ ప్రయాణంలో రిటైల్ ఇన్వెస్టర్లు పొందిన రాబడులు (సొంతంగా) మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాదు, మార్కెట్లు ప్రతికూలంగా మారిపోతే రిటైల్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను వేగంగా మార్చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన వివరాలను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. 2003 నుంచి 2022 వరకు (20 ఏళ్లు) ఈక్విటీ మార్కెట్లు, డెట్ ఫండ్స్‌కు సంబంధించి 2009–2022 (14 ఏళ్లు) గణాంకాలను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ చేసి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో ఈక్విటీ లేదా హైబ్రిడ్ ఫండ్స్ విభాగాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడులు కనిష్ట స్థాయిలో ఉంటే, మ్యూచువల్ ఫండ్స్ రాబడులు గరిష్టంగా ఉన్నాయి.
ఇదీ వ్యత్యాసం..
2003 నుంచి 2022 మధ్య మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈక్విటీ పెట్టుబడులపై సగటున 19.1 శాతం వార్షిక రాబడులను సంపాదించాయి ఇదే కాలంలో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడి 13.8 శాతంగానే ఉంది. ఇక సిప్ ద్వారా వచ్చిన రాబడులు 15.2 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడి 7.4 శాతం మేర ఉంటే, ఫండ్స్ సంస్థలకు 12.5 శాతం చొప్పున వచ్చాయి. ఇక్కడ కూడా సిప్ రాబడి 10.1 శాతానికి పరిమితమైంది. ఇక పూర్తిగా డెట్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లు 6.6 శాతం మేర వార్షిక రాబడి సంపాదించగా, సిప్ ఫండ్స్ సంస్థల రాబడి 7 శాతం చొప్పున ఉంది.
ఎందుకని..?
మరి రిటైల్ ఇన్వెస్టర్ల రాబడులు ఎందుకు తక్కువగా ఉన్నాయి..? మార్కెట్లు అస్థిరంగా మారిన వెంటనే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్‌ను వేగంగా మార్చేస్తుండడం రాబడులను దెబ్బతీస్తోంది. మార్కెట్ ధోరణికి తగ్గట్టు పరుగెత్తకుండా.. పూర్తి మార్కెట్ సైకిల్ వరకు పెట్టుబడులను కొనసాగించడమే దీనికి పరిష్కారమని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో సూచించింది. పాయింట్ టు పాయింట్ (కచ్చితంగా నిర్ణీత కాలానికి) రాబడులు అధ్యయనంలోకి తీసుకుంది. స్వల్పకాల మార్కెట్ల అస్థిరతలను చూసి సిప్ నిలిపివేస్తే, అసలు లక్ష్యమే దెబ్బతింటుందని యాక్సిస్ మ్యాచువల్ ఫండ్ హెచ్చరించింది. అస్థిరతల్లో స్థిరత్వం కోల్పోకుండా, పెట్టుబడులను నమ్మకంగా కొనసాగించడం.. అది సాధ్యం కాకపోతే రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఈ నివేదిక తెలియజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment