న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో స్టాండెలోన్ నికర లాభం 142 శాతంపైగా జంప్ చేసి రూ. 606 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 250 కోట్లు ఆర్జించింది. అధిక వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది.
ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 58 శాతం ఎగసి రూ. 3,405 కోట్లను తాకింది. 2020–21లో రూ. 2,160 కోట్లు మాత్రమే ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ.2 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. సీఆర్‌ఏఆర్ 17 శాతాన్ని అధిగమించగా.. ఈ ఏడాది(2022–23) రూ. 2,500 కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నట్లు బ్యాంక్ తెలియజేసింది.
మార్జిన్లు ప్లస్
ప్రస్తుత సమీక్షా కాలం(క్యూ4)లో బీవోఐ నికర వడ్డీ ఆదాయం 36 శాతం పుంజుకుని రూ. 3,986 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 2.01 శాతం నుంచి 2.58 శాతానికి మెరుగుపడ్డాయి. మార్చికల్లా స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 13.77 శాతం నుంచి 9.98 శాతానికి భారీగా తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 3.35 శాతం నుంచి 2.34 శాతానికి నీరసించాయి. కాగా.. రూ. 1,045 కోట్ల ఫ్యూచర్ గ్రూప్ రుణాలకు 100 శాతం కేటాయింపులు చేపట్టినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ బాటలో రూ. 963 కోట్ల శ్రేఈ గ్రూప్ రుణాలకుగాను 50% ప్రొవిజన్లు చేపట్టినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment