
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం ఆదివారం బ్రాంచ్‌లను తెరవడంపై బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్– ఏఐబీఓసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్‌కు సబ్‌స్క్రిప్షన్‌ను సులభతరం చేయడానికి ఏఎస్‌బీఏ (అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) అధీకృత శాఖలను ఆదివారం తెరిచివుంచాలనే ఆర్‌బీఐ నిర్ణయం సరికాదని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బ్యాంక్ పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. చాలా దరఖాస్తులు డిజిటల్‌గా దాఖలవుతాయని పేర్కొంటూ, ఆర్‌బీఐ నిర్ణయం ఎటువంటి ప్రయోజనాన్ని అందించదని విశ్లేషించింది. ‘‘ఇన్వెస్టర్లు ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించి విస్తృత స్థాయిలోఆన్‌లైన్ సౌలభ్యతనే ఎంచుకుంటారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, చాలా (ఏఎస్‌బీఏ) శాఖలు ఫిజికల్‌గా ఐపీఓకు సంబంధించి ఆదివారం ఒక్క దరఖాస్తును కూడా పొందలేవని మేము భావిస్తున్నాము. అటువంటి పరిస్థితులలో, అన్ని సంబంధిత బ్రాంచీలను తెరిచి ఉంచాలని నిర్ణయం సమంజసం కాదు. ఇది ఒక ప్రహసనం. బ్యాంకులు ఈ తరహా భారీ వ్యయాన్ని భరించలేవు‘ అని ఏఐబీఓసీ ఒక ప్రకటనలో తెలిపింది.
రూ.100 కోట్ల వ్యయం!
ఇలాంటి నిర్ణయాలు సహజంగానే పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచే బ్యాంకుల అధికారులకు అసంతృప్తిని కలిగిస్తాయని ఏఐబీఓసీ వివరించింది. బ్యాంక్ శాఖలను సెలవు దినాల్లో పని చేయమని కోరడానికి దీపమ్ (పెట్టుబడి మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం) చాలా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, దీనివల్ల ఒనగూడే ప్రయోజనాలపై ఆర్‌బీఐ తగిన విధంగా అంచనా వేయలేకపోయిందని విమర్శించింది. ఈ నిర్ణయం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోదని పేర్కొన బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్, దీనివల్ల బ్యాంకింగ్‌పై వ్యయ భారం (సెలవు రోజున ఉద్యోగులకు పరిహారం, ఇతర నిర్వహణా వ్యయలుసహా) రూ.100 కోట్ల వరకూ ఉంటుందని విశ్లేషించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఆర్‌బీఐ ఈ అంశంపై సమీక్షించాలని, ఆదివారం బ్రాంచ్‌లను ప్రారంభించాలనే నిర్ణయాన్ని రీకాల్ చేయాలని యూనియన్ పేర్కొంది. ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ఏఎస్‌బీఏ అధీకృత అన్ని శాఖలు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్‌బీఐ బ్యాంకులను బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ ఐపీఓ బిడ్డింగ్ 4న ప్రారంభమైంది. 9న ముగుస్తుంది. శని (మే 7), ఆది వారాల్లో (మే 8) కూడా బిడ్డింగ్‌కు అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment