నీటి అడుగున ఉండే వింతలను కళ్లారా చూడాలని, వాటి ఫొటోలు తీసుకోవాలని చాలామందికి కోరికగా ఉన్నా, నేరుగా నీటిలోకి దూకడానికి తటపటాయిస్తారు. సరదాగా స్విమ్మింగ్ పూల్‌లోనో, చిన్నపాటి చెరువులోనో ఈతలు కొట్టేవాళ్లు కూడా సముద్రంలోకి దిగాలంటే వెనుకంజ వేస్తారు. మరి నీటి అడుగున ఉన్న వింత విడ్డూరాలను ఫొటోలు తీసుకోవడమెలా?
ఇదిగో, ఈ ఫొటోలో కనిపిస్తున్న బుల్లి డ్రోన్ ఉంటే భేషుగ్గా నీటి అడుగున ఉండే వింత విడ్డూరాల ఫొటోలు సులభంగా తీసుకోవచ్చు. గ్రీస్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘బెంటిక్స్’ ఈ మినియేచర్ అండర్‌వాటర్ డ్రోన్‌ను రూపొందించింది. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే, నీటి అడుగున గంటన్నరసేపు నిక్షేపంగా చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసి దీనికి అనుసంధానమైన యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపగలదు. దీనిని రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు.
దీని పొడవు 11.8 అంగుళాలు, వెడల్పు 9.8 అంగుళాలు, ఎత్తు 5.9 అంగుళాలు. బరువు ఐదు కిలోలు మాత్రమే! దీనిని ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. ‘బెంటిక్స్’ ప్రస్తుతం దీనిని నమూనాగా రూపొందించింది. ఆసక్తిగల సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే, మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా దీని ఉత్పాదన భారీ స్థాయిలో ప్రారంభిస్తామని ‘బెంటిక్స్’ ప్రతినిధులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment