ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ భారత్ పే, 'పోస్ట్ పే' పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. 'బై నౌ పే లేటర్' (బిఎన్‌పిఎల్) కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్లు భారత్ పే ప్రకటించింది. "పోస్ట్ పే" యాప్ ను కస్టమర్లు ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రూ.10 లక్షల వరకు వడ్డీ లేని క్రెడిట్ లిమిట్ పొందవచ్చు అని తెలపింది. 'పోస్ట్ పే' భారీ కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ కొనుగోళ్లకు వర్తిస్తుంది అని తెలిపింది. తన రుణ భాగస్వాముల కోసం మొదటి 12 నెలల్లో పోస్ట్ పే ద్వారా 300 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ పే పేర్కొంది.
సులభంగా చెప్పాలంటే మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఈ యాప్ ద్వారా నగదు చెల్లించి. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఆ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లించకపోతే రుసుము వసూలు చేస్తారు. మీ క్రెడిట్ చరిత్ర ఆధారంగా రాను రాను రుణ పరిమితి పెరుగుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ మీద ఎటువంటి ప్రభావం పడదు అని కంపెనీ తెలిపింది. అలాగే, మీరు గనుక భారీ మొత్తం దీని ద్వారా చెల్లిస్తే దానిని ఈఎమ్ఐల ద్వారా సులభంగా తిరిగి చెల్లించవచ్చని ఫిన్ టెక్ కంపెనీ తెలిపింది. కస్టమర్ చేయాల్సిందల్లా పోస్ట్ పే యాప్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. (చదవండి: బిగ్‌బుల్ ఝున్‌ఝున్‌వాలా ఏం చేయబోతున్నాడు? సర్వత్రా ఆసక్తి)
అలాగే, వినియోగదారులు స్టోర్స్ వద్ద పోస్ట్ పే కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. క్యాష్ బ్యాక్, రివార్డులు కూడా లభిస్తాయి. పోస్ట్ పే యాప్ లేదా కార్డు ద్వారా చేసే చెల్లింపులపై వార్షిక ఫీజు లేదా లావాదేవీ ఛార్జీలు లేవని కంపెనీ తెలిపింది. అంతేగాక, దుబాయ్ లో జరగబోయే ఐసీసీ టి20 ప్రపంచ కప్ కోసం ప్రపంచ స్పాన్సర్లలో పోస్ట్ పే ఒకరు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 24 వరకు జరగబోయే మ్యాచ్ కోసం వినియోగదారులు 3,500 ఉచిత పాసులు గెలుచుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ప్రతి ఒక్కరికీ రుణం అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఏమిటీ బీఎన్‌పీఎల్
కొన్ని వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లును వెంటనే చెల్లించకుండా.. కొన్నాళ్ల తర్వాత ఒకేసారి లేదా వాయిదాల రూపంలో చెల్లించేందుకు వీలు కల్పించే విధానమే ఈ బీఎన్‌పీఎల్. ఈ వ్యవధిలో సున్నా శాతం లేదా స్వల్ప వడ్డీని ఈ బీఎన్‌పీఎల్ సంస్థలు వసూలు చేస్తాయి. చిన్న మొత్తంలో రుణం కావాలని అనుకున్నప్పుడు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎన్నో ఫిన్‌టెక్ అంకురాలు ఇప్పుడు ఈ బీఎన్‌పీఎల్ సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు బ్యాంకులూ ఈ విభాగంలోకి ప్రవేశించాయి. ఇ-కామర్స్ వెబ్‌సైట్లూ.. కొన్ని సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment