ఇల్లు చూడు.. ఇంటి అందం చూడు అనేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంతా టీవీ చూడు.. టీవీలో కనబడే పెద్ద బొమ్మ చూడు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీలు కొనేవారితో పోల్చితే ఇండియాలో పెద్ద స్కీన్ టీవీలు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోందట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు చిన్న స్క్రీన్ టీవీలు కొనాలని అడిగే వారే లేరంటోంది ఓ రీసెర్చ్ సంస్ధ. ఇంతకీ ఇంతలా పెద్ద స్క్రీన్ టీవీలు ఎందుకు కొంటున్నారు?
బిగ్ స్క్రీన్స్‌కు బిగ్ డిమాండ్
కార్ల కంటే కూడా ఇండియన్స్ బిగ్ స్క్రీన్ టీవీలను కొనుగోలు చేసేందుకు తెగ ఉత్సాహపడుతున్నారని ఒక సర్వే తేల్చింది. కొంత మంది చిన్న కార్ల ధరలో టీవీలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారట. సాధారణంగా 3, 4 లక్షల నుంచి 75 లక్షలు ధరల కలిగిన టీవీ మార్కెట్ విపరీతంగా పెరుగుతోందట. ఒటీటీలు వచ్చిన తరువాత చాలా మంది ఇండ్లలోనే హోమ్‌థియేటర్స్ ఏర్పాటు చేసుకుని చూడటానికి ఇష్టపడటమే ఇందుకు కారణంగా కనపడుతోంది. కరోనా సమయంలో చాలా మంది ఇంటికే పరిమితమవడం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పెద్ద టీవీలను కొనుగోలు చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది.
65 ఇంచుల టీవీలను ఎగబడి కొంటున్నారు..
జిఎఫ్‌కె మార్కెట్ రీసెర్చ్ ప్రకారం 65 ఇంచుల టీవీలు కొనుగోలు చేయడానికి జనాలు తెగ ఉత్సాహం చూపుతున్నారట దీంతో ఈ మార్కెట్ 37శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక రోజు రోజుకు చిన్నటీవీల మార్కెట్ తగ్గుతూవస్తోంది. ఈ టీవీలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపేవారే కరువయ్యారట. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో ఓవరాల్‌గా టీవీ మార్కెట్ 13 శాతం వృద్ధి సాధించింది. ఇందులో బిగ్ స్క్రీన్ మార్కెట్ వాటా 17శాతం దాకా ఉంది. కోవిడ్ కంటే ముందు ఈ వాటా కేవలం 5శాతానికి మాత్రమే పరిమితమైంది.
Additional Big TV Screen pic.twitter.com/RrLJdJoyPx
— rajinder kumar (@rajinder75kumar) July 7, 2023
రూ. 75 లక్షల టీవీ అమ్మకాలకు ఫుల్ క్రేజ్
ఇక వినియోగదారుల ఇష్టానికి అనుగుణంగా బ్రాండెడ్ టీవీ కంపెనీలు సైతం పెద్ద పెద్ద స్కీన్స్ ఇండియాలో లాంచ్ చేసేందుకు తెగ ఆరాటపడుతున్నాయి. ఎల్‌జీ కంపెనీ ఇప్పటికే భారీ తెర కలిగిన ఓఎల్‌ఈడీ టీవీని లాంచ్ చేసింది. ఇండియాలో ఈ టీవీనే అత్యంత ఖరీదైన టీవీ . ఈ టెలివిజన్ ధర 75 లక్షలుగా ఉంది. దీన్ని ఎలా అంటే అలా చుట్టేయవచ్చు. అంతేకాదు దేశంలోని టాప్ టీవీల అమ్మకం కంపెనీ సైతం నెలకు 20 యూనిట్లు 20 లక్షల ధర కలిగిన టీవీల అమ్మకాలు చేపడుతుండగా, 10 లక్షలకు పైగా ధర ఉన్న టీవీలను నెలకు 100 దాకా అమ్ముతోంది. ఈ దీపావళికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది.
టెలివిజన్ తయారీ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ప్రజలు కూడా వారి వారి లగ్జరీ లైఫ్ కు అనుగుణంగా ఇంట్లో ఉండే టీవీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్లెక్సీ ఈఎమ్‌ఐల రూపంలో కంపెనీలు టీవీల అమ్మకాలు చేయడం కూడా వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడానికి కారణంగా కనపడుతోంది. కేవలం బ్రాండెడ్ టీవీలే కాకుండా దేశీ బ్రాండ్ టీవీలు సైతం లోకల్ మార్కెట్లో అందుబాటులోకి రావడంతో చాలా మంది తక్కువ ధరకే పెద్దస్క్రీన్ టీవీలను కొనుగోలు చేస్తున్నారని జిఎఫ్‌కె రీసెర్చ్ తెలిపింది.
బిగ్ స్క్రీన్ టీవీల మార్కెట్ విలువ 32 బిలియన్ డాలర్లు
ఇండియాలో స్మార్ట్ టీవీ మార్కెట్ సైజ్ 2022లో 9.88 బిలియన్ డాలర్లు కాగా 2023 చివరి నాటికి అది 11.7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2023-2030 నాటికి ఇండియా టీవీ మార్కెట్ 16.7 శాతం వృద్ధితో 32.57 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందనేది నిపుణులు చెపుతున్నమాట. భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కింద టీవీ తయారీ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలిస్తే తయారీ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పైగా టీవీలలో వాడే చిప్‌లు ఇండియాలోనే తయారవుతుండటం టీవీ తయారీ కాంపోనెంట్స్ దిగుమతులు తగ్గుతుండటంతో అతిపెద్ద టీవీ స్క్రీన్స్‌కు ధర మరింతగా తగ్గే అవకాశం ఉంది.
- రాజ్ కుమార్, డిప్యూటీ ఇన్‌పుట్ ఎడిటర్, బిజినెస్, సాక్షి టీవీ
Comments
Please login to add a commentAdd a comment